
అర్జీలిచ్చి.. మొర పెట్టుకుని..
● కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● 524 వినతుల అందజేత
నెల్లూరు రూరల్: ‘మా వినతులు పరిశీలించి న్యాయం చేయండి’ అంటూ ప్రజలు అధికారులను కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ ఎం.వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అత్యధికంగా రెవెన్యూ శాఖవి 180, పోలీస్ శాఖవి 120, పంచాయతీరాజ్ శాఖవి 46, నగరపాలక సంస్థవి 46, ఇతర శాఖలు కలిపి మొత్తం 524 వినతులందాయి.
● తొలుత కలెక్టర్ అర్జీదారులకు సంబంధించి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి ఆరాతీశారు.
● ఐటీడీఏ తరఫున తోపుడు బండ్లు అందించాలని ఎం.రంగయ్య, సీహెచ్ ఉష, సతీష్ చంద్ర తదితరులు కోరారు.
● ఐటీడీఏ పీఓ మల్లికార్జునరెడ్డి తమను హేళనగా మాట్లాడుతున్నారని, విచారించి తగిన చర్యలు తీసుకోవాలని పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శివయ్య, జిల్లా అధ్యక్షుడు మురళి విన్నవించారు.
● దసరా సెలవుల్లోనూ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయని కలెక్టర్‌కు పీడీఎస్‌యూ నేతలు వినతిపత్రం అందజేశారు. షేక్ షారుక్, కె.ఆశిర్, ఎస్‌కే అన్వర్ మస్తాన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
రాకపోకలు ఆపేశారు
శెట్టిపల్లి సురేష్ అనే వ్యక్తి మా పొలాలకు దారి ఇవ్వకుండా జేసీబీతో తవ్వించేశాడని కలువాయి మండలం వెంకటరెడ్డి పల్లి గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ పంటలు కోతకు వచ్చాయన్నారు. రాకపోకలకు వీలు లేకుండా చేశారని, న్యాయం చేయాలని కోరారు.
మమ్మల్ని రిలీవ్ చేయండి
తమను పాఠశాలల నుంచి రిలీవ్ చేయాలని పలువురు ఉపాధ్యాయులు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ బదిలీ అయినా ఉపాధ్యాయులు లేకపోవడంతో అదే పాఠశాలలో కొనసాగుతున్నామన్నారు. తక్షణం రిలీవ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

అర్జీలిచ్చి.. మొర పెట్టుకుని..

అర్జీలిచ్చి.. మొర పెట్టుకుని..