
కన్నబిడ్డే తరిమేశాడయ్యా..
● కలెక్టర్‌కు కన్నీరు తెప్పించిన రమాజ్యోతి
● ఆమె బాధకు చలించిన హిమాన్షు శుక్లా
నెల్లూరు రూరల్: ‘అయ్యా.. నేను నడవలేను. ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. కాటికి కాళ్లు చాచిన స్థితిలో ఉన్న నన్ను పెద్ద కొడుకు మోసం చేశాడు. బాగా చూసుకుంటానని మభ్యపెట్టి ఉన్న ఇంటిని అతని పేరు మీద రాయించుకున్నాడు. ఇప్పుడు ఇంటి నుంచి తరిమేశాడు. నిలువ నీడ లేకుండా పోయింది. కూడు, గుడ్డ, గూడు కోసం ఇబ్బంది పడుతున్నాను. నాకు న్యాయం చేయండి’ అని కావలి పట్టణానికి చెందిన రమాజ్యోతి అనే వృద్ధురాలు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు తన బాధను తెలిపి బోరున విలపించింది. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జ్యోతి మరో మహిళను తోడుగా తీసుకుని వచ్చింది. లోనికెళ్లి అర్జీ ఇచ్చేందుకు నేలమీదే కూర్చొని వేచి చూడసాగింది. హిమాన్షు శుక్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తొలిసారిగా వస్తూ రమాజ్యోతిని చూశారు. ఆమె వద్దకెళ్లి కష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. కుమారుడు ఎం.శ్రీనివాస్ నన్ను మభ్యపెట్టి రాయించుకున్న ఇంటి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి కాస్తంతా నీడ కల్పించాలని కలెక్టర్‌కు చెప్పుకొని ఏడ్చింది. ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. చలించిపోయి అధికారులను పిలిచి ఆమెకు సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు.