
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
● కలెక్టరేట్ ఎదుట విద్యుత్ ఉద్యోగుల నిరసన
నెల్లూరు రూరల్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కాంట్రాక్ట్ లేబర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గత ప్రభుత్వంలో అనుసరించిన విధంగా నేరుగా యాజమాన్యం వేతనాలు చెల్లించాలన్నారు. 2019లో నియమించబడిన ఎనర్జీ అసిస్టెంట్లను రెగ్యులర్ చేసి జేఎల్‌ఎంలుగా పరిగణించి వేతనాలు తదితర ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ఇంజినీరింగ్ డిగ్రీ కలిగిన జూనియర్ ఇంజినీర్లకు ఏఈఈలుగా పదోన్నతి కల్పించాలని కోరారు. అన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణయ్య, కన్వీనర్ ఎన్‌వీ రాఘవరెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.
● సీహెచ్‌సీ ఎదుట
ఆందోళన
ఉదయగిరి: పురిటిబిడ్డకు పోస్టుమార్టం చేయొద్దంటూ ఉదయగిరి సామాజిక ఆరోగ్యం కేంద్రం వద్ద సోమవారం ఆందోళన జరిగింది. సీతారామపురం మండలం బసినేనిపల్లికి చెందిన మంజుల ప్రసవ సమయంలో పురిటిబిడ్డ మృతిచెందిన విషయం తెలిసిందే. నెల్లూరు నుంచి వచ్చిన వైద్యులు నవజాత శిశువుకు పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రయత్నించగా ఆ కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. దీంతో సీహెచ్‌సీలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోస్టుమార్టం నిర్వహించేందుకు వీల్లేదని, బిడ్డను ఇవ్వాలని ఆందోళన చేపట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. సీఐ ఎన్.వెంకట్రావు, ఎస్సై ఇంద్రసేనారెడ్డి వారికి నచ్చజెప్పి పోస్టుమార్టం నిర్వహించి పురిటిబిడ్డను అప్పగించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ రవీంద్రనాఽథ్ ఠాగూర్‌పై సోమవారం స్థానికంగా ఎలాంటి విచారణ జరగకపోవడంతో బాధితులు ఉన్నతాధికారుల తీరుపై మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసిన వైద్యుడిపై చర్యలు తీసుకోకపోతే మళ్లీ ఆందోళన చేస్తామని చెప్పారు.

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్