
మా ఇష్టం.. ఎప్పుడైనా వస్తాం
నెల్లూరు రూరల్: కలెక్టరేట్‌లోని పలు సెక్షన్ల ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 10:30 గంటలైనా ఒకరిద్దరు కనిపిస్తారంతే. సాయంత్రం మాత్రం గంట కొట్టగానే వెళ్లిపోతున్నారు. మమ్మల్ని అడిగేదెవరులే అన్నట్టుగా నచ్చిన సమయంలో వస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొత్తగా వచ్చిన కలెక్టర్ హిమాన్షు శుక్లా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
రోడ్డుపై కుప్పకూలి..
● వృద్ధుడి మృతి
నెల్లూరు(క్రైమ్): ఓ వృద్ధుడు రోడ్డుపై కుప్పకూలి మృతిచెందిన ఘటన నెల్లూరులోని సుబేదార్‌పేటలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పి.నరసింహ (74) తన సమీప బంధువైన సౌత్‌రాజుపాళేనికి చెందిన రాహేలు ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన కొంతకాలంగా మూర్చ వ్యాధితో బాధపడుతున్నాడు. సోమవారం నరసింహ అదే గ్రామానికి చెందిన వృద్ధురాలితో కలిసి సామగ్రి కొనుగోలు చేసేందుకు సుబేదార్‌పేటకు వచ్చాడు. ఈక్రమంలో ఆయన రోడ్డుపై కుప్పకూలి మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో సంతపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. రాహేలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కావలి(అల్లూరు): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కావలి మండలం ముసునూరు గ్రామం బ్ర హ్మంగారి గుడి వీధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కొల్లిబోయిన దేవమణి (32) స్టిక్కరింగ్ పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు స్నేహితులతో కలిసి తుమ్మలపెంట బీచ్ వద్ద ఫూటుగా మద్యం తాగాడు. తిరిగి బైక్‌పై వస్తుండగా పడిపోయాడు. స్నేహితులు దేవమణిని ఇంటికి తీసుకెళ్లారు. సోమవారం తెల్లవారుజామున అతడికి ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కావలి ప్రభుత్వాస్పత్రికి తరలించగా డాక్టర్ పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కావలి రూరల్ ఎస్సై తిరుమలరెడ్డి కేసు నమోదు చేశారు.

మా ఇష్టం.. ఎప్పుడైనా వస్తాం