
చంద్రబాబు పాలన రైతులకు శాపం
వెంకటాచలం: చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా.. రైతులకు శాపంగా పరిణమిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగానికి అండగా ఉండాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబుకు ఏమాత్రం లేదన్నారు. మండలంలోని తాటిపర్తిపాళెంలో కృష్ణపట్నం పోర్టు రోడ్డుపై పోసిన ధాన్యం రాసులను సోమవారం కాకాణి పరిశీలించారు. పంట కోతకు వచ్చిన దశలో వర్షాల కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులు, గిట్టుబాటు ధర గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాకాణి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుకు రాష్ట్రాన్ని దోచుకోవాలనే ఆలోచన తప్ప, రైతులను పట్టించుకునే ఆలోచన లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యూరి యా కొరత తీర్చలేక చంద్రబాబు యూరియా ఎక్కువగా వాడితే కేన్సర్ వస్తుందని, ఒకసారి, అవసరానికి మించి అధికంగా యూరియాను సరఫరా చేశామని మరోసారి చెప్పడం రెండు నాల్కుల ధోరణికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా యూరియాను ప్రైవేట్ డీలర్లకు ఇచ్చారని ఆరోపించారు. కష్టపడి పండించిన పంట వర్షానికి తడవడం, మద్దతు ధర లేకపోవడంతో రైతులు దిక్కతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.20,187 కల్పించాల్సి ఉంటే, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు రూ.13 వేలకు అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. వరికోతలన్నీ పూర్తయ్యే సమయంలో చంద్రబాబు రైతులకు సంబంధించి కీలక ప్రకటన చేస్తానని ప్రకటించడం సిగ్గు చేటన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఏడుస్తుంటే, సోమిరెడ్డి ఇరిగేషన్ పనులకు సంబంధించి బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని అసెంబ్లీలో మాట్లాడం అతని దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో తాను వ్యవసాయశాఖ మంత్రిగా రైతులు పండించిన ప్రతి పంటకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి రైతు లు నష్టపోకుండా చేశామని గుర్తు చేశారు. వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మండల కన్వీనర్ కొణిదెన మోహన్‌నాయుడు, ఎంపీటీసీలు వేమారెడ్డి రఘునందన్‌రెడ్డి, శివకుమార్ రెడ్డి, నేతలు ఆరుగుంట ప్రభాకర్‌రెడ్డి, కొణిదెన విజయభాస్కర్‌నాయుడు, గుమ్మా మోహన్ తదితరులు పాల్గొన్నారు.
రైతాంగానికి అండగా
ఉండాలనే ఆలోచనే చేయడు
పండించిన పంటలకు
గిట్టుబాటు ధరల్లేవు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి