
జేసీగా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ
నెల్లూరురూరల్: జాయింట్ కలెక్టర్‌గా మొగిలి వెంకటేశ్వర్లు కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లేందుకు, అందుకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఏ సమస్య అయినా తనను ప్రజలు నేరుగా వచ్చి కలుసుకోవచ్చు అన్నారు.
కోర్టు విధులను బహిష్కరించిన
న్యాయవాదులు
నెల్లూరు (లీగల్): ఏపీ హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్ నంబర్ 10/2025కు నిరసనగా నెల్లూ రు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అయ్యపరెడ్డి, జల్లి పద్మాకర్, ప్రధాన కార్యదర్శి నాగరాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు విద్యార్థినుల
అదృశ్యం
నెల్లూరు (క్రైమ్): వేర్వేరు కళాశాలల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన ఘటనలపై సోమవారం చిన్నబజారు పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. కలువాయికి చెందిన ఓ బాలిక నెల్లూరు నగరంలోని రావూస్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతూ కాలేజీ హాస్టల్‌లో ఉంటోంది. ఈ నెల 21వ తేదీ హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఈ విషయం తెలుసుకున్న బాధిత తల్లి హుటాహుటిన నెల్లూరుకు చేరుకుని కుమార్తె అదృశ్యంపై చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుటుంబ సభ్యుల పేరిట ఫోన్ వచ్చాక..
బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన ఓ యువతి నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ కళాశాల హాస్టల్‌లో ఉంటోంది. ఈ నెల 20వ తేదీన హాస్టల్ వార్డెన్‌కు విద్యార్థిని కుటుంబ సభ్యుల పేరిట ఫోన్ వచ్చింది. విద్యార్థినిని ఇంటికి పంపాలని కోరారు. దీంతో విద్యార్థిని హాస్టల్ నుంచి బయ టకు వెళ్లింది. కుమార్తెతో మాట్లాడేందుకు తల్లిదండ్రులు హాస్టల్‌కు ఫోన్ చేయగా వార్డెన్ జరిగిన విషయాన్ని చెప్పాడు. తాము ఫోన్ చేయలేదని బాధిత తల్లిదండ్రులు హాస్టల్ వార్డెన్‌కు చెప్పారు. కుమార్తె అదృశ్యంపై బాధిత తండ్రి సోమవారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డీకేడబ్ల్యూలో జాబ్‌మేళా నేడు
నెల్లూరు (పొగతోట): నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు డీకే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్‌ఖయ్యూం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్‌మేళాలో 15 పరిశ్రమలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.