
సైబర్ మోసగాళ్ల వలలో విద్యుత్ లైన్ ఇన్‌స్పెక్టర్
● ఏసీబీ డీఎస్పీ పేరుతో
రూ.2 లక్షలు కాజేసిన వైనం
వింజమూరు (ఉదయగిరి): వింజమూరు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ లైన్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రామ్మూర్తి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. బాఽధితుడు తెలిపిన సమాచారం మేరకు.. బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన డి.రామ్మూర్తి ఏడాది నుంచి వింజమూరులో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 28న రామ్మూర్తికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఏసీబీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లు తెలిపారు. మీరు విద్యుత్ పనుల్లో అవినీతికి పాల్పడినట్లు మా వద్ద ఆధారాలు ఉన్నాయని, అవి బయటకు రాకుండా ఉండాలంటే డబ్బులివ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే రామ్మూర్తి తన వద్ద ఏమీ లేవని ఫోన్ కట్ చేశాడు. దీంతో వింజమూరు విద్యుత్ ఏఈ నాగూర్‌వలికి సైబర్ నేరగాళ్లు ఏసీబీ డీఎస్పీ పేరుతో ఫోన్ చేసి రామ్మూర్తికి కాన్ఫరెన్స్ కాల్ కనెక్ట్ చేయించారు. ఈ క్రమంలో ఏఈ రామ్మూర్తికి వారు చెప్పినట్లు చేయమని ఆదేశించాడు. దీంతో వెంటనే తన భార్య మెడలో ఉన్న బంగారం తాకట్టు పెట్టి ఆమె ఖాతా నుంచి రూ.లక్ష, రామ్మూర్తి ఖాతా నుంచి మరో రూ.98 వేలు వారు తెలిపిన ఖాతాలకు ఫోన్ పే ద్వారా పంపారు. తర్వాత ఈ విషయం స్నేహితులకు చెప్పడంతో ఇది సైబర్ మోసంగా గుర్తించారు. వెంటనే అదే రోజు నెల్లూరులో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటన జరిగిన నాలుగు రోజులకు కావలి ఏఈకి ఫోన్ చేసి అక్కడ పనిచేస్తున్న లైన్ ఇన్‌స్పెక్టర్ ఫోన్ నంబరు అడిగారు. వింజమూరు ఘటన వారికి తెలియడంతో అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. రామ్మూర్తి రూ.24 లక్షలు బ్యాంకులో అప్పు తెచ్చి గతంలో కావలి జరిగిన మనీ స్కీమ్ మోసపోవడం గమనార్హం.