
అక్రమ కేసులెన్ని పెట్టినా ఎదుర్కొంటాం
● కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. అక్రమ కేసులు పెట్టి వేధించడం నిత్యకృత్యంగా మారిందన్నారు. జిల్లాలో టీడీపీ నేతలు కొత్త సంస్కృతిని పరవళ్లు తొక్కిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే అనేక మంది తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారన్నారు. జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ మాజీ చైర్మన్ వీరి చలపతిపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయడంతో కాకాణి ఆదివారం నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పరామర్శించారు. కాకాణి మాట్లాడుతూ వీరి చలపతి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగిన దళిత నాయకుడని, కూటమి ప్రభుత్వాన్ని, స్థానిక నాయకులను ప్రశ్నించడం జీర్ణించుకోలేక ఆయనపై 16 సెక్షన్లతో కేసు నమోదు చేశారన్నారు. 2023లో జరిగిన దాడికి సంబంధించి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తర్వాత వీరి చలపతిని ఇబ్బంది పెట్టాలని హత్యాయత్నంతోపాటు, మరో 15 సెక్షన్లతో కేసు నమోదు చేశారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతుందని, ఎటువంటి కేసులు పెట్టాలో, వారిని ఎన్ని రోజులు జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టాలో అనుకూల మీడియాతో వారిపై దుష్ప్రచారం చేయిస్తుందన్నారు. కొత్తగా వచ్చిన మహిళ ఎస్పీపై జిల్లా ప్రజలందరూ ఆశలు పెట్టుకున్నారన్నారు. శాంతి భద్రతలు మెరుగు పడతాయని పక్షపాత వైఖరి లేకుండా పని చేస్తారని జిల్లా ప్రజలందరూ భావించారన్నారు. పాత ఎస్పీ బాటలోనే, కొత్త ఎస్పీ నడవడం బాధాకరమన్నారు. తప్పుడు కేసుపై స్పందించిన పోలీసులు, పోలీసుల ‘సాక్షి’గా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడి విషయంలో ఎందుకు స్పందించడం లేదో ఎస్పీ సమాధానం చెప్పాలన్నారు. అధికారం ఎల్లకాలం ఒకరి చేతుల్లోనే ఉందని, తిరిగి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, మీరు పెట్టే అక్రమ కేసులు, వేధింపులతో బాధపడిన, నష్టపోయిన మా నాయకులు, కార్యకర్తల కోసం మేము ఇదే పంథాలో పయనిస్తే, మీ పరిస్థితి ఏంటో గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసులపై అధికార పార్టీ నాయకులు దాడి చేసినా సర్దుకుపోతున్నారన్నారు. మేము పోలీసులు చేసే అన్యాయాన్ని ప్రశ్నించినా పోలీసు అసోసియేషన్ మాపై మాట్లాడుతుందన్నారు.
డైవర్షన్ పాలిటిక్స్
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్‌కు కూటమి ప్రభుత్వ తెర తీసిందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. డీసీఎమ్మెఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు అక్రమ అరెస్టు దారుణమన్నారు. రాష్ట్రంలో నూతన మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కళాశాలలు మాత్రమే ఉంటే జగన్‌మోహన్‌రెడ్డి చివరి మూడేళ్లలో 17 కొత్త మెడికల్ కళాశాలను తీసుకువచ్చి వైద్య విద్యను పేద విద్యార్థులకు చేరువు చేయాలని సంకల్పించారని తెలిపారు. చంద్రబాబు ఇప్పటి వరకు ఒక్క కొత్త మెడికల్ కళాశాలను కూడా తీసుకురాక పోగా జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను చంద్రబాబు వైద్య విద్యతో వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. వీటిని వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తుందనే నెపంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ లిక్కర్ కేసు, మైనింగ్ కేసు అంటూ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. వీరి వెంట ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వైఎస్సార్‌సీపీ కోవూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు నల్లపరెడ్డి రజత్‌కుమార్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
అక్రమ కేసులో ఐదుగురి అరెస్ట్
జిల్లా కేంద్ర కారాగారానికి తరలింపు
నెల్లూరు (క్రైమ్) : కొడవలూరు పోలీసుస్టేషన్‌లో నమోదైన అక్రమ కేసులో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతితోపాటు మరో నలుగురిని పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. కొడవలూరు మండలం నార్తురాజుపాళెంకు చెందిన టీడీపీ నేత మల్లికార్జునపై 2023లో దాడి చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం వీరి చలపతితోపాటు 19 మందిపై కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి వీరి చలపతిని పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరు రూరల్ పోలీసుస్టేషన్‌లో ఉంచారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న అనపల్లి ఉదయ్‌భాస్కర్, పి. శ్రీకాంత్, బొచ్చు దాసు, వీరి సురేష్ ఆదివారం కొడవలూరు పోలీసుల వద్ద లొంగిపోయారు. దీంతో ఐదుగురికి జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించి న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో నిందితులను జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు.