
మహిళ మెడలో చైన్ అపహరణ
పొదలకూరు: మహిళ మెడలో చైన్‌ను ఆగంతకులు లాక్కెళ్లిన ఘటన మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. నరసింహకండ్రికలోని మెయిన్ రోడ్డు వద్ద ప్రొవిజన్స్ షాపును గ్రామానికి చెందిన బొగ్గల వెంగమ్మ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమశిల – పొదలకూరు మార్గంలోని దుకాణం వద్దకు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఇద్దరు వచ్చి బైక్‌ను నిలిపారు. వీరిలో ఒకరు దుకాణం వద్దకెళ్లి చిప్స్ ప్యాకెట్లు, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తున్నట్లు నటించి.. ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారు సరుడును తెంపుకెళ్లాడు. పెనుగులాటలో కొంత తెగిపోయి ఆమె చేతికొచ్చింది. ఆపై అక్కడే సిద్ధంగా ఉన్న బైక్‌పై పొదలకూరు వైపు ఉడాయించారు. సరుడు విలువ రూ.మూడు లక్షలుంటుంది. సమాచారం అందుకున్న ఎస్సై హనీఫ్ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కొరుటూరులో చోరీ
● రూ.ఐదు లక్షల అపహరణ
ఇందుకూరుపేట: ఇంట్లోని వస్తువులను దహనం చేయడంతో పాటు నగదును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన మండలంలోని కొరుటూరులో చోటుచేసుకుంది. ఎస్సై నాగార్జునరెడ్డి వివరాల మేరకు.. ఏలూరుకు చెందిన రామకృష్ణ కొరుటూరులో చేపల గుంతలను తీసుకొని చేప పిల్లల వ్యాపారాన్ని సాగిస్తూ ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో పని నిమిత్తం నెల్లూరుకు శనివారం ఉదయం వెళ్లారు. తిరిగి రాత్రొచ్చేసరికి ఇంట్లోని వస్తువులు దహనమవుతుండటాన్ని గమనించారు. హుటాహుటిన లోపలికెళ్లి చూడగా, బియ్యం డ్రమ్ములో దాచి ఉంచిన రూ.ఐదు లక్షలు అపహరణకు గురై ఉన్నాయి. నగదును చోరీ చేసి ఇంట్లోని వస్తువులకు నిప్పు పెట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి ఎస్సై చేరుకొని వివరాలను ఆరాతీశారు. ఆధారాలను క్లూస్‌టీమ్ సేకరించింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శవమై తేలిన ఇంజినీర్
● కర్నూలు జిల్లాలో ఘటన
● మృతుడు ఆత్మకూరు వాసి
కోడుమూరు రూరల్: కర్నూలు జిల్లా గూడూ రు మండలంలోని సుంకేసుల డ్యామ్ వద్ద సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తూ కనిపించకుండాపోయిన విజయ్‌కుమార్ (27) మృతదేహం ఆదివారం లభ్యమైంది. కర్నూలు నగరంలోని స్టాంటన్‌పురం కొట్టాల వద్ద ఉన్న కేసీ కెనాల్‌లో ఓ మృతదేహం తేలుతూ కనిపించడంతో తాలుకా అర్బన్ పోలీసులు ఒడ్డుకు చేర్చి పరిశీలించారు. గూడూరు పీఎస్‌లో ఆచూకీ లేకుండా పోయిన సైట్ ఇంజినీర్‌గా గుర్తించారు. ఆత్మకూరు మండలం గండ్లవేడుకు చెందిన విజయకుమార్ సుంకేసుల డ్యామ్ వద్ద కేఎల్‌ఎస్సార్ ఇన్‌ఫ్రాటెక్ ప్రాజెక్ట్‌లో సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తూ ఈ నెల 17 నుంచి కనిపించడంలేదంటూ పోలీసులకు మేనమామ నాగేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలిస్తున్న వేళ మృతదేహం లభ్యమైంది. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చిరంజీవి తెలిపారు.
వ్యక్తిపై దాడి
నెల్లూరు(క్రైమ్): తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ ఓ వ్యక్తిపై కొందరు దాడి చేసి గాయపర్చారు. పోలీసుల సమాచారం మేరకు.. కొత్తూరులో నివాసం ఉంటున్న రాజేంద్ర సంతోష్‌కుమార్ ప్లంబింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రామకోటయ్యనగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో స్నేహితుడు మీరాతో ఈ నెల తొమ్మిదో తేదీ రాత్రి మాట్లాడుతుండగా.. నిప్పో సెంటర్‌కు చెందిన కిట్టు, స్నేహితులు టింకూ, చందు, మహేష్, నవీన్ అక్కడికొచ్చి గొడవకు దిగారు. దీంతో పోలీసులకు రాజేంద్ర ఫోన్ చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీన్ని మనస్సులో పెట్టుకొని రాజేంద్ర ఇంటి వద్దకు కిట్టు, టింకూ, చందు మహేష్, నవీన్ ఈ నెల 12న వెళ్లి.. తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ దాడి చేశారు. చుట్టుపక్కల వారు రావడంతో నిందితులు పరారయ్యారు. ఈ మేరకు వేదాయపాళెం పోలీసులకు బాధితుడు ఆదివారం ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో టింకూ రౌడీషీ టరని పోలీసులు చెప్పారు.

మహిళ మెడలో చైన్ అపహరణ