
ప్రభుత్వాస్పత్రిలో గర్భశోకం
ఉదయగిరి: తొలి ప్రసవం కోసం పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ మహిళకు గర్భశోకమే మిగిలింది. వైద్యంలో నిర్లక్ష్యమే నవజాత శిశువు మృతికి కారణమంటూ బాధితురాలి బంధువులు ఉదయగిరి సీహెచ్‌సీ ఎదుట ఆందోళనను చేపట్టారు. పోలీసులు, బాధిత మహిళ బంధువుల వివరాల మేరకు.. సీతారామపురం మండలం బసినేనిపల్లికి చెందిన మంజుల పురిటి నొప్పులతో ఉదయగిరిలోని ప్రభుత్వాస్పత్రికి 108లో శనివారం ఉదయం వచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ ప్రశాంత్ ఆమె పరిస్థితిని గమనించి.. ఇక్కడ సరైన వసతుల్లేని కారణంగా ఆత్మకూరులోని ప్రభుత్వాస్పత్రికి పంపుతామని చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లేందుకు గానూ 108 కోసం నిరీక్షించసాగారు. ఈ తరుణంలో గైనకాలజిస్ట్ ఠాగూర్ తాను కాన్పు చేస్తానని.. ఎక్కడికీ వెళ్లొద్దని సూచించారు. ఆపై వైద్యాన్ని ప్రారంభించి నర్సుకు సూచనలు చేశారు. ఈ తరుణంలో డీసీహెచ్ మృదులతో సమావేశ ఏర్పాటు, ఇతర కార్యక్రమాలతో ఆయన పట్టించుకోలేదు. పరిస్థితిని నర్సులు గమనిస్తూ వైద్యుడికి సమాచారమిచ్చినా, పెద్దగా స్పందించలేదు. రాత్రి ఏడు గంటల సమయంలో ఆమెను వైద్యుడు పరీక్షించి మరో ఐదు గంటల్లో ప్రసవమవుతుందని చెప్పి వెళ్లిపోయారు. అప్పటికే ఆమె పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నా, పట్టించుకోలేదు. నొప్పులు తీవ్రం కావడంతో ఆస్పత్రిలోని ఓ గదిలో పడుకున్న వైద్యుడు ఠాగూర్‌ను సిబ్బంది లేపేందుకు యత్నించినా, తలుపును తీయలేదు. పరిస్థితి విషమంగా మారడంతో డ్యూటీ నర్సు అతికష్టంపై అర్ధరాత్రి 12.16 సమయంలో కాన్పు చేశారు. మగ బిడ్డ జన్మించినా, చలనం లేకపోవడంతో తీవ్రతను గమనించారు. ఠాగూర్ ఉన్న గది వద్దకెళ్లి తలుపు తట్టినా లేవకపోవడంతో కేకలేయడంతో ఎట్టకేలకు వచ్చారు. బిడ్డకు సీపీఆర్ చేసినా ఫలితం కానరాలేదు. దీంతో బంధువులను పిలిచి వెంటనే నెల్లూరు తీసుకెళ్లాలని సూచించారు. 108లో పంపేందుకు యత్నిస్తుండగా, బిడ్డలో చలనం లేదని, శ్వాస పూర్తిగా ఆగిపోయిందనే అంశాన్ని నిర్ధారించారు. దీంతో తల్లి రోదనకు అంతులేకుండా పోయింది. ఠాగూర్ నిర్లక్ష్యంతోనే బిడ్డను కోల్పోయామంటూ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఘటన స్థలానికి ఎస్సై ఇంద్రసేనారెడ్డి చేరుకొని బంధువులకు సర్దిచెప్పేందుకు యత్నించారు. వైద్యుడిపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ విషయమై వైద్యుడు ఠాగూర్ మాట్లాడుతూ.. సాధారణ కాన్పు కోసం యత్నించానని, ఇలాంటి పరిస్థితి అరుదుగా ఉంటుందని.. బాధితులు అర్థం చేసుకోవాలని కోరారు. కాగా సదరు వైద్యుడిపై గతంలోనూ పలు వివాదాలున్నాయి.
కన్నీరుమున్నీరైన తల్లి
వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
ఉదయగిరి సీహెచ్‌సీలో ఘటన

ప్రభుత్వాస్పత్రిలో గర్భశోకం