
అంతా నా ఇష్టం
కూటమి ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు, నాయకులతో పాటు అధికారులు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా దేవదాయశాఖలో అధికారులు వారు చెప్పిందే వేదంగా అమలవుతోంది. భక్తులను నిలువుదోపిడీ చేయడమే కాకుండా వారి మనోభావాలను సైతం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు.
కానుకల లెక్కింపులోనూ
అవకతవకలు
పూర్వం నుంచి హుండీ కానుకల లెక్కింపు ప్రత్యేకాధికారి సమక్షంలో ఆలయ సిబ్బంది ద్వారా లెక్కించి వచ్చిన ఆదాయాన్ని మీడియాకు తెలిపేవారు. అలాగే వచ్చిన విదేశీ కరెన్సీ, బంగారం, వెండి, నగదు బ్యాంక్‌లో జమ చేసేవారు. ఆగస్టు 3వ తేదీన జరిగిన హుండీ లెక్కింపులో భాగంగా మీడియాకు విదేశీ కరెన్సీ గురించి ఎలాంటి సమాచారం లేకుండా గోప్యంగా లెక్కింపు చేయడంపై అనేక అనుమానాలు తెరతీశాయి.
వలేటివారిపాలెం: మండలంలోని అయ్యవారిపల్లి గ్రామ పంచాయతీలో వెలసిన మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ పనితీరు ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. ప్రతి శనివారం ఉదయం 5.30 నుంచి సాయంత్రం 5.30 వరకు మాలకొండ దేవస్థానంలో భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుంది. కాగా ప్రత్యేక దర్శనానికి గతంలో రూ.100 టికెట్ ఉండేది. అలాగే భక్తులకు గర్భగుడిలో పూజలు చేసేవారు. ప్రస్తుతం ఉన్న డిప్యూటీ కమిషనర్ ప్రత్యేక దర్శనం టికెట్ ఎప్పుడూ లేనివిధంగా రూ.500కు పెంచేశారు. అంతేకాకుండా గర్భగుడిలో ఎలాంటి పూజలు చేయకుండా కేవలం శఠగోపం పెట్టి పంపిస్తున్నారు. భక్తులు ఎక్కవగా ఉండటం వల్ల ఇలా చేయాల్సి వస్తోందనే సమాధానాలు ఇస్తున్నారు. దీనిపై హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తుడు డిప్యూటీ కమిషనర్‌ను ప్రశ్నించగా.. మా దేవాలయంలో దర్శనాలు ఇలాగే ఉంటాయని చెప్పి పంపించారు.
బహిరంగ ప్రదేశాల్లో
టెంకాయలు కొట్టాలట
పూర్వం నుంచి దర్శనానికి వచ్చిన భక్తులు గర్భగుడి ప్రవేశంలో ఉన్న మొదటి ద్వారం దగ్గర టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకునేవారు. ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ గర్భగుడిలో టెంకాయలు కొట్టనివ్వకుండా గుడి బయట ప్రదేశాల్లో కొట్టమని ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అంతేకాకుండా టెంకాయ చిప్పలు పొగు చేసుకునే వ్యక్తి తాను టెండర్ వేసుకున్నానని, ఇలా బహిరంగ ప్రదేశాల్లో టెంకాయలు కొట్టనివ్వడం వల్ల తనకు నష్టం జరుగుతుందని డిప్యూటీ కమిషనర్‌ను అడిగారు. దీనికి ఆయన సమాధానమిస్తూ నీకు ఇష్టం ఉంటే చిప్పలు పొగు చేసుకో.. లేకుంటే మానేసేయ్ అని సమాధానం ఇవ్వడంతో అతను నివ్వెరపోయాడు.
కొందరికే జరిమానా
ఆలయంలో తొమ్మిది షాపులు ఉండగా నిబంధనల మేరకు వ్యాపారం చేసుకోవాలి. ధరలు పెంచితే ఆ షాపు మీద జరిమానాలు వేయాలి. అయితే ఆలయంలో ఉన్న ప్రతి షాపులో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయి. అదే విధంగా చెప్పులు స్టాండ్ వారు అధికంగా వసూలు చేస్తున్నారని డిప్యూటీ కమిషనర్ కేవలం ఆయా షాపు వారి మీద రూ.10 వేల జరిమానా వేసి మిగతా షాపులకు జరిమానా వేయకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి.
ఆలయ సిబ్బంది అవస్థలు
గత మూడు నెలల నుంచి ఆలయంలో పనిచేసే అర్చకులు, శాశ్వత, ఒప్పంద సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదు. దీని గురించి డిప్యూటీ కమిషనర్‌ను అడిగితే సిబ్బంది భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించి భక్తుల మనోభావాలకు దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
సంప్రదిస్తే వెటకారంగా సమాధానం
ఈ విషయాలపై డిప్యూటీ కమిషనర్‌ను సాక్షి సంప్రదించగా దీనిపై మీకు వచ్చిన ఇబ్బందులు ఏమిటని ఎదురు ప్రశ్నలు వేశారు. నీకు అంతగా వివరణ కావాలంటే దేవస్థానం సమయం అయ్యాక తన ఆఫిస్‌కు వస్తే వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని వెటకారంగా సమాధానమిచ్చారు.
ఆలయ నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటీ కమిషనర్ తీరు
ప్రత్యేక దర్శన టికెట్ రూ.100 నుంచి రూ.500 పెంపు
మూడు నెలలుగా సిబ్బందికి జీతాల్లేవ్
మాలకొండ దేవస్థానంలో ఇదీ పరిస్థితి

అంతా నా ఇష్టం