
సోమిరెడ్డి అనుచరులపై చర్యలు తీసుకోవాలి
నెల్లూరురూరల్: మరుపూరు గ్రామంలోని మా సొంత తోటలో పెరిగిన వంద టేకు చెట్లను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనుచరులు అక్రమంగా నరికి తీసుకెళ్లారని, వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాజేశ్వరి కోరారు. 45వ డివిజన్ పొగతోటలో శనివారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. టేకుచెట్ల నరికివేతపై సోమిరెడ్డితో మాట్లాడితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టమని చెప్పారన్నారు. కానీ పొదలకూరు పోలీసుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో ఎస్పీ కూడా వినతి పత్రం అందచేసినట్లు తెలిపారు. ఎస్పీ విచారించాలని సీఐకి రెఫర్ చేస్తే, ఎస్సై మాటలు విని మా భూమి పత్రాన్ని తీసుకొని రిజర్వు ఫారెస్ట్‌గా చూపిస్తానని, ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరించారని వాపోయారు. ఓ క్రిమినల్ కేసును సివిల్ కేసుగా చూపించారన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అసలు దొంగలను పట్టుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.