
ఎన్నికల ఖర్చుపై నిఘా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై నిఘా ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చుకు వీలు లేదని, ఇందుకు పరిమితులు ఉంటాయని చెబుతున్నారు. జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల వ్యయం రూ.4 లక్షలకు మించరాదు. అలాగే ఎంపీటీసీ అభ్యర్థి వ్యయం రూ.1.50 లక్షల లోపు ఉండాలి. ఇక సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు కూడా ఓ లెక్క ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. ఐదు వేల జనాభా లోపు ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి అభ్యర్థి ఖర్చు రూ.1.50 లక్షల లోపు అలాగే వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.30 వేల లోపు ఉండాలి. మరోవైపు ఐదు వేలకు మించి జనాభా ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు బరిలోకి దిగుతున్న అభ్యర్థులకు రూ.2.50 లక్షలు, వార్డు సభ్యునికి ఖర్చు రూ.50 వేలు ఉండాలని ఎన్నికల ప్రవర్తన నియమావళి చెబుతోంది. ఖర్చు చేసే ప్రతీ రూపాయి బ్యాంకు లావాదేవీల ద్వారానే జరగాల్సి ఉంటుంది. ఆయా స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసే రోజుకంటే ఒకరోజు ముందుగా ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాలి. అభ్యర్థులు ఎప్పటికప్పుడు తమ ఎన్నికల ఖర్చు వివరాలను తెలపాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
పరిశీలకుల నియామకం
స్థానిక సంస్థలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెట్టేందుకు మండల స్థాయిలో సహాయక పరిశీలకులను (అసిస్టెంట్ ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్లు) నియమించారు. గెజిటెడ్ అధికారుల నుంచి ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారులను ఈ పరిశీలకులుగా నియమించారు.
లెక్కలు తప్పనిసరి
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్థులు ఓ స్థాయిలో ఖర్చు చేస్తుంటారు. ప్రధానంగా పట్టణీకరణ ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలు, మండలాల్లో అభ్యర్థుల ఖర్చు భారీగానే ఉంటుంది. ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, పోస్టర్లు, కరపత్రాలు, కండువాలు, క్యాప్‌లు, టీషర్టులు వంటి ఖర్చులు ఉంటాయి. జెడ్పీటీసీ అభ్యర్థులు సమావేశాలు సైతం నిర్వహిస్తుంటారు. ఎన్నికల ప్రచారానికి వాహనాలను వినియోగిస్తుంటారు. ఇలా అభ్యర్థులు తాము పెట్టే ఎన్నికల ఖర్చుకు లెక్కలు చూపాలని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల విషయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు పాటించాలని ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్ నోడల్ అధికారి, జిల్లా ఆడిట్ అధికారి బలరాం ‘సాక్షి’తో పేర్కొన్నారు.
జెడ్పీటీసీకి రూ.4 లక్షలు.. ఎంపీటీసీకి రూ.1.50 లక్షలు
అభ్యర్థులు వెచ్చించే వ్యయంపై పరిమితులు
మండలస్థాయిలో సహాయక పరిశీలకులు
అభ్యర్థులు ఎంసీసీని
పాటించాలంటున్న అధికారులు