
వాల్మీకి చరిత్ర చిరస్మరణీయం
కలెక్టర్ హైమావతి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రపంచం ఉన్నంత వరకు వాల్మీకి చరిత్ర ఉంటుందని కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జయంతి వాల్మీకి చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో జీవరాశి ఉన్నంత వరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందన్నారు. ఇతిహాసాల్లో మొదటిది రామాయణం, పెద్దది మహాభారతం అన్నారు. వాల్మీకి ఇచ్చిన స్ఫూర్తితో అనేక మంది రచయితలుగా, కవులుగా మారారన్నారు. ఇలాంటి గొప్ప వారి చరిత్రల గురించి తెలుసుకోవడం నేటి తరానికి చాలా ముఖ్యమన్నారు. కార్యక్రమంలో జెడ్పీసీఈఓ రమేశ్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సయ్యద్ రఫీ, తదితరులు పాల్గొన్నారు.