
జ్వర సర్వేను నిర్వహించండి
డీఎంహెచ్‌ఓ ధనరాజ్
సిద్దిపేటకమాన్: క్షేత్ర స్థాయిలో జ్వర సర్వేను నిర్వహించి రక్త నమూనాలు సేకరించి తగిన చికిత్స అందించాలని డీఎంహెచ్‌ఓ ధనరాజ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. నాసర్‌పూర అర్బన్ పీహెచ్‌సీ, అంబేడ్కర్ నగర్ యుపీహెచ్‌సీని డీఎంహెచ్‌ఓ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న జ్వరాలు, మలేరియా, డెంగీ వ్యాధులను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, పాటించని వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.