
స్థానికంపై ఫోకస్
క్షేత్ర స్థాయిలో జోరుగా సర్వేలు
ఇన్‌చార్జి మంత్రి దృష్టికి
జెడ్పీటీసీ అభ్యర్థుల పేర్లు
ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి
ముగ్గురు చొప్పున లిస్టు
బీఆర్‌ఎస్ సైతం తలమునకలు
అధిష్టానానికి పేర్లను సిఫార్స్ చేసిన బీజేపీ
అభ్యర్థుల ఎంపికపై పార్టీల కసరత్తు
గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఆశావహులు రిజర్వేషన్లకు అనుగుణంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు గుర్రాల కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. మరోవైపు ఆశావహులపై క్షేత్రస్థాయిలో సర్వేలు ప్రారంభించినట్లు సమాచారం. జిల్లా ప్రజాపరిషత్, మండల పరిషత్ పీఠాలను కై వసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. –సాక్షి, సిద్దిపేట
స్థానిక సంస్థల బరిలో దిగే అభ్యర్థుల ఎంపికలపై అధికార పార్టీ వేగం పెంచింది. ఇదివరకే మండలాల వారీగా ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఒక్కో జెడ్పీ స్థానం నుంచి మూడు పేర్లతో కూడిన జాబితాను పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులు, ఎమ్మెల్యే, మంత్రి అందరూ కలిసి ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్‌కు అందజేశారు. రిజర్వేషన్‌కు అనుగుణంగా ఉపకులాలవారికి అవకాశం కల్పిస్తూ శాసన సభ నియోజకవర్గాలవారీగా జాబితాను రూపొందించారు. మరోవైపు ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయన్న దానిపై క్షేత్ర స్థాయిలో సర్వేలు నిర్వహిస్తోంది. ఆ సర్వేల ఆధారంగా అభ్యర్థులను పార్టీ ఇన్‌చార్జులు, ఎమ్మెల్యేలతో ఇన్‌చార్జి మంత్రి వివేక్ చర్చించి అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.
ఎంపికలో బీఆర్‌ఎస్ నిమగ్నం
జిల్లాలో బీఆర్‌ఎస్ బలంగా ఉంది. 2019లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో 23 స్థానాలకు గాను 22 చోట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. జెడ్పీ చైర్‌పర్సన్ పీఠం బీఆర్‌ఎస్‌కు దక్కింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, జనగామ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పార్టీ గెలుపొందగా, ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గం మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. జిల్లాలోని అన్ని జెడ్పీటీసీలను, ఎంపీపీ, ఎంపీటీసీలను కైవసం చేసుకునేందుకు గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు. ఎంపికలు పూర్తి చేయాలని పార్టీ నిర్దేశించడంతో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడంలో నిమగ్నమయ్యారు.