రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం
● అదనపు కలెక్టర్ గరీమాఅగర్వాల్ ● ఎన్నికల సిబ్బందికి చివరి విడత శిక్షణ
సిద్దిపేటరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్, జోనల్ అధికారులకు చివరి విడత శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేవరకు రిటర్నింగ్ అధికారుల బాధ్యత చాలా ముఖ్యమైనదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇస్తున్న చివరి విడత శిక్షణలో అధికారులు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ కరదీపికను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోవాలన్నారు. నామినేషన్ల ప్రక్రియను మొదలుకొని కౌంటింగ్ వరకు తప్పులు లేకుండా సమర్థవంతంగా ఎన్నికలను నిర్వహించాలన్నారు. నామినేషన్ల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి అభ్యర్థితో కలిపి ముగ్గురితో పాటు ఒక వాహనానికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. స్థానిక పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి పోలీస్ బందోబస్తు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎంపీడీఓలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల నిబంధనలను తెలపాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమేష్, డీపీఓ దేవకీదేవి, డీఆర్‌ఓ నాగరాజమ్మ, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.


