
సంక్షేమ రాజ్యం కాంగ్రెస్‌తోనే సాధ్యం
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
లింగారెడ్డిపల్లిలో గృహప్రవేశం
జగదేవ్‌పూర్(గజ్వేల్): ఇందిరమ్మ ఇళ్లు పేదలందరికి అందిస్తామని, సంక్షేమ రాజ్యం కాంగ్రెస్‌తోనే సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. మండల పరిధిలోని లింగారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు పూర్తి కావడంతో సోమవారం లబ్ధిదారులు కవిత, నర్సింలు దంపతులు గృహప్రవేశం చేశారు. నర్సారెడ్డి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడం జరుగుతుందన్నారు. లింగారెడ్డిపల్లిలో 70 ఇళ్లు మంజూరు కాగా 23 ఇళ్ల నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయన్నారు. నియోజకవర్గంలోనే మొదటి ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం చేయడం సంతోషంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా అందరికీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. గజ్వేల్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.