
రైల్వేలైన్ పనుల పరిశీలన
చిన్నకోడూర్(సిద్దిపేట): మండల పరిధిలోని గంగాపూర్ శివారులో రైల్వేలైన్ నిర్మాణ పనులను మంగళవారం సాయంత్రం కలెక్టర్ హైమావతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రైల్వే లైన్ పనుల్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించలేదు. దీంతో రైల్వే లైన్ నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లి రైతుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ రైల్వే లైన్ నిర్మాణ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. పనులను అడ్డుకోవడం సరైందికాదన్నారు. నష్ట పరిహార విషయాన్ని తహసీల్దార్, ఆర్డీఓల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. అర్హులైన బాధితులందరికీ తప్పనిసరిగా పరిహారం అందేలా చూస్తామంటూ హామీనిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, తహసీల్దార్ సలీం, రైతులు, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.