పత్తి టెండర్‌ | - | Sakshi
Sakshi News home page

పత్తి టెండర్‌

Oct 6 2025 9:21 AM | Updated on Oct 6 2025 9:21 AM

పత్తి

పత్తి టెండర్‌

టెండర్లకు జిన్నింగ్‌ మిల్లుల

యాజమాన్యాలు దూరం

8న తుది గడువు..

ప్రభుత్వ చొరవపైనే ఆధారం

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో

4.90 లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగు

సీసీఐ కేంద్రాల ఏర్పాటులో ప్రతిష్ఠంభన

సీసీఐ(కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌

ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రతిష్ఠంభన నెలకొంది. కేంద్రాల నిర్వహణలో కొత్త నిబంధనల వల్ల తాము నష్టపోయే అవకాశముందని, పాత విధానంలోనే కొనుగోళ్లు చేపడతామంటేనే తాము టెండర్లలో పాల్గొంటా మని జిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. ఈనేపథ్యంలో మూడోసారి పిలిచిన టెండర్లకు ఈనెల 8తో గడువు ముగియనుంది. ప్రభుత్వ చొరవపైనే కేంద్రాల ఏర్పాటు అంశం ఆధారపడి ఉంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మరో పది రోజుల్లో పత్తి మార్కెట్‌లోకి వచ్చే అవకాశముండగా, కేంద్రాలను ప్రారంభించకపోతే తీవ్రంగా నష్టపోయే

ప్రమాదముందని రైతులు ఆందోళన

చెందుతున్నారు.

గజ్వేల్‌: ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని సిద్దిపేట జిల్లాలో ఈసారి 1,07,243 ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చింది. ఇక్కడ 10 లక్షల క్వింటాళ్లకుపైగా దిగుబడులు వస్తాయని అంచనా. మెదక్‌ జిల్లాలో 34,751 ఎకరాల్లో పత్తి సాగులోకి రాగా 4.17 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. సంగారెడ్డి జిల్లాలో సుమారుగా 3.48 లక్షల పైచిలుకు ఎకరాల్లో పత్తి సాగులోకిరాగా ఇక్కడ 25లక్షల క్వింటాళ్లకుపైగా దిగుబడులు వస్తాయని మార్కెటింగ్‌ శాఖ అంచనావేస్తోంది. మూడు జిల్లాల్లో కలుపుకుని సుమారుగా 40 లక్షల క్వింటాళ్ల దిగుబడులు వచ్చే అవకాశముంది. పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఏటా 50కిపైగా జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటారు.

సీసీఐ టెండర్లకు జిన్నింగ్‌ మిల్లులు దూరం

గతంతో పోలిస్తే సీసీఐ ఈసారి కొనుగోలు కేంద్రాల నిర్వహణకు కొత్త నిబంధనలను అమలు చేయడానికి నిర్ణయించింది. ఇందులోభాగంగానే కేంద్రాలు నిర్వహించే ప్రాంతంలో...ఆ ప్రాంతానికి సంబంధించిన పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని, ఇతర ప్రాంతాల నుంచి వస్తే కొనుగోలు చేయవద్దని సూచించింది. మరోవైపు సౌకర్యాల ఆధారంగా జిన్నింగ్‌ మిల్లులను ఎల్‌1, ఎల్‌2 పేరిట రెండు కేటగిరీలుగా విభజించి ఎల్‌1 కేంద్రాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నది. ఇక కొనుగోళ్లకు తప్పనిసరిగా ‘కాపాస్‌ కిసాన్‌ యాప్‌’ను వాడాలని స్పష్టం చేసింది. తేమ శాతం 12కంటే ఎక్కువగా ఉంటే కొనుగోళ్లకు అనుమతి ఉండదని చెబుతూ తరుగు శాతం గతంలో 1.70% ఉండగా, దానిని సగానికి కుదించారు. ఈ నిబంధనలు తమకు గుదిబండగా మారాయని, గతంలో మాదిరిగానే కొనుగోళ్లను కొనసాగిస్తామంటేనే తాము టెండర్లలో పాల్గొని, సీసీఐ కేంద్రాల ఏర్పాటుకు సహకరిస్తామని జిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచినా యాజమాన్యాల నుంచి స్పందన లేకపోగా మూడోసారి పిలిచిన టెండర్లకు ఈనెల 8న తుది గడువుగా విధించారు. మరో పది రోజుల్లో పత్తి ఉత్పత్తులు మార్కెట్‌ బాట పట్టే అవకాశముండగా, ఆలోగా కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే పత్తి కొనుగోళ్లకు అడ్డంకులు తప్పవనే పరిస్థితి ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చొరవపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

నిబంధనలు మారిస్తేనే టెండర్లలో పాల్గొంటాం

కొత్త నిబంధనలు అమలు చేయకుండా, గతంలో మాదిరిగా కొనుగోళ్లు చేపడితే సీసీఐ టెండర్లలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. సోమ వారం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో జిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాల సమావేశం ఉంది. ఇందులో చర్చలు సఫలమవుతాయని భావిస్తున్నాం. –జిల్లా శ్రీనివాస్‌– అధ్యక్షుడు,

ఉమ్మడి మెదక్‌ జిల్లా

జిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాల సంఘం

పత్తి టెండర్‌1
1/1

పత్తి టెండర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement