
ప్రయాణికుల రద్దీతో పాట్లు
కిక్కిరిసిన బస్టాండ్‌లు
● సెలవులు ముగియడంతో తిరుగు పయనం ● స్పెషల్ సర్వీసుల పేరిట ఆర్టీసీ అదనపు చార్జీల వసూలు
సిద్దిపేటకమాన్: బతుకమ్మ, దసరా పండగ వరుస సెలవులు ముగియడంతో ప్రజలు తమ సొంతూరు నుంచి పట్టణాలకు తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆదివారం ఆర్టీసీ బస్టాండ్‌లు కిటకిటలాడాయి. రద్దీకి అనుగుణంగా సమయానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండడంతో మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు.
అదనపు ట్రిప్పులు
సిద్దిపేట పట్టణంలోని మోడ్రన్ బస్టాండ్, న్యూబస్టాండ్ నుంచి ప్రతి నిత్యం వేల మంది ప్రయాణికులు జేబీఎస్, హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, జగిత్యాల, వేములవాడ, సిరిసిల్ల, రామాయంపేట, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ వంటి ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణిస్తుంటారు. సెలవు దినాల్లో, పండగ రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. సిద్దిపేట డిపోలో 53 ఆర్టీసీ, 53 అద్దె బస్సులతో కలిపి మొత్తం 106 బస్సులు వివిధ రూట్లలో అధికారులు తిప్పుతున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోలో 77 బస్సులు, దుబ్బాక డిపోలో 38 బస్సులు, హుస్నాబాద్ డిపోలో 40 బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. పండగ రోజుల్లో 50 నుంచి 60 ట్రిప్పులు అదనంగా నడుపుతున్నారు. దసరా పండగకు ఆర్టీసీ సిద్దిపేట డిపోకు రూ.1.5కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. కాగా, పండగ సందర్భంగా స్పెషల్ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు.
ఇబ్బందులు లేకుండా చర్యలు
బతుకమ్మ, దసరా పండగ సెలవులు ముగియడంతో తమ సొంతూర్లకు వచ్చిన వారు తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. రద్దీ దృష్ట్యా ఆదివారం 50 నుంచి 60 ట్రిప్పులు అదనంగా నడిపాం. ఆర్టీసీ అదికారులు, సిబ్బంది బస్టాండ్‌లో దగ్గర ఉండి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. – రఘు, డిపో మేనేజర్

ప్రయాణికుల రద్దీతో పాట్లు