● ఆస్పత్రి విస్తరణ పేరిట పాత భవనాలు కూల్చివేత ● 250 పడకల ఆస్పత్రి కోసమేనంటున్న అధికారులు, పాలకులు ● మాతా శిశు సంరక్షణ కేంద్రానికి రోగులు, వైద్య పరికరాలు తరలింపు
ఒకే ప్రాంగణంలో నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రి భవనాలను నేలమట్టం చేశారు. నాటి ఆనవాళ్లు లేకుండా తుడిచి పెట్టుకుపోయాయి. స్థలం కొరతతో ఇదే ప్రాంగణంలో కొత్తగా 250 పడకల ఆస్పత్రి భవనాన్ని నిర్మించాలని వీటిని కూల్చివేశారు. కాగా ప్రజాధనం వృథా అయ్యిందని పలువురు ఆరోపిస్తున్నారు. – హుస్నాబాద్
హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి 30 పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. తరువాత మరో 20 పడకలకు పెంచారు. రోగుల సంఖ్య పెరగడంతో ప్రత్యేక రాష్ట్రంలో ఈ ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేస్తూ మే, 30, 2017లో అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. మొత్తంగా 100 పడకల ఆస్పత్రిగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఆస్పత్రికి రోజుకు 400 మంది రోగులు వివిధ చికిత్స కోసం వస్తున్నారు. ప్రసవాల సంఖ్యతోపాటు కిడ్నీ రోగులకు డయాలసిస్, మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా సాగుతున్నాయి.
మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు
హుస్నాబాద్‌లో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ప్రస్తుతం ఉన్న వంద పడకల ఆస్పత్రిని ప్రభుత్వం 250 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ ఆస్పత్రి నిర్మాణం కోసం రూ.82 కోట్లు మంజూరు చేసింది. అయితే.. ఆస్పత్రి నిర్మాణానికి స్థలం సరిపోదని నిర్ణయించారు. దీంతో ఇప్పటికే ఉన్న వంద పడకల ఆస్పత్రి భవనాలను పూర్తిగా కూల్చివేసి, నూతన ఆస్పత్రిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం కూల్చివేత పనులు తుది దశకు చేరుకున్నాయి.
మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలింపు
ఆస్పత్రి ప్రాంగణంలో ఇటీవల ప్రారంభించిన మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇంకా డాక్టర్లు, సిబ్బంది, ఇతర సదుపాయాలు కల్పించాల్సి ఉంది. రోగులతో పాటు వైద్య పరికరాలను తరలించారు. నూతన భవనం పూర్తి అయ్యే వరకు ఇక్కడే వైద్య సేవలు అందనున్నాయి.
ప్రజాధనం నేలపాలు!
ప్రజాధనం నేలపాలు!
ప్రజాధనం నేలపాలు!