డైలమాలో ఆశావహులు! | - | Sakshi
Sakshi News home page

డైలమాలో ఆశావహులు!

Oct 5 2025 8:50 AM | Updated on Oct 5 2025 8:50 AM

డైలమాలో ఆశావహులు!

డైలమాలో ఆశావహులు!

కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

అందరి చూపు 8వ తేదీ వైపే..

సాక్షి, సిద్దిపేట: స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటికీ ఆశావహుల్లో ఇంకా డైలమా కొనసాగుతోంది. న్యాయపరమైన చిక్కులను దాటి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా.?, లేదా అనే చర్చ పల్లెల్లో సాగుతోంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్‌పై ఈ నెల 8వ తేదీన హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని బరిలోనే నిలిచే వారు, అధికారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు కల్పించింది. అలాగే వార్డు, సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్‌ స్థానం రిజర్వేషన్‌ గెజిట్‌ను జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. 2018, 2019 జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 22.79 శాతం, ఎస్సీలకు 20.53, ఎస్టీలకు 6.68శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించారు. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం ఈ మూడు వర్గాలకు కలిపి 69.21శాతంకు రిజర్వేషన్లు పెరిగాయి. దీంతో 50 శాతానికి మించవద్దని హైకోర్టును పలువురు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన హైకోర్టులో విచారణ ఉంది. న్యాయస్థానం ఏమి ఆదేశిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ నలుగురు కలిసినా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. కోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు మళ్లీ మారుతాయా? అనే చర్చ అన్ని పార్టీల నాయకుల్లో సాగుతోంది. మరోవైపు 9న ఎంపీటీసీ, జెడ్పీటీసీల మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు పెట్టేందుకు అధికారులు అన్ని సిద్ధం చేస్తున్నారు.

సమాయత్తం కావాలంటున్న పార్టీలు

పల్లెల్లో అభివృద్ధి కుంటుపడిందని వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే బీఆర్‌ఎస్‌ తమ అభిప్రాయం వ్యక్తం చేసింది. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలు జరుగుతాయని క్షేత్రస్థాయి నాయకులకు అప్రమత్తం చేస్తోంది. ఎన్నికలపై సందిగ్ధతను పక్కనబెట్టి సమాయత్తం కావడమే మంచిదనే అభిప్రాయాన్ని ఆయా పార్టీల ముఖ్యనేతలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలకు సూచిస్తున్నారు. స్తబ్దుగా ఉంటే ప్రత్యర్థి పార్టీకి పరిస్థితులు అనుకూలంగా మారే ప్రమాదం లేకపోలేదని శ్రేణులు జాగ్రత్తంగా ఉండాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

రిజర్వేషన్లు మారితే..?

హైకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు మారితే ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్‌లు ఏవి అన్‌ రిజర్వ్‌ (జనరల్‌), మహిళా అవుతాయో తెలియని పరిస్థితి ఉండగా ,ఆశావహులంతా మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ముందుకు పోవాలా ? వద్దా అనే అంశంపై తమ సన్నిహితులతో మాట్లాడుకుంటున్నారు. కోర్టు ఆదేశాలతో మార్చాల్సి వస్తే అందుకు సైతం అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశిస్తే మూడు రోజుల్లో మళ్లీ కొత్త రిజర్వేషన్లు మార్చేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో అందరూ ఆసక్తిగా 8వ తేదీన ఉన్నత న్యాయస్థానం తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.

స్థానిక ఎన్నికల

రిజర్వేషన్‌పై చర్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement