
లక్ష్యాన్ని అధిగమించాలి
● ఈ ఏడాది స్లాట్ బుకింగ్ ప్రక్రియ ● అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
సిద్దిపేటజోన్: ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం అధిగమించేందుకు యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. శనివారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నూతన యాప్ కపాస్ కిసాన్ గురించి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్‌లో కొత్తగా యాప్ ప్రవేశ పెట్టినట్టు తెలిపారు. పత్తి రైతులు తప్పనిసరి కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. సీసీఐ ద్వారా ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలు పత్తికి రూ 8,110 ప్రకటించిందని, అది పొందడానికి యాప్‌లో స్లాట్ ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. అందుకు అనుగుణంగా జిల్లా అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో పత్తి రైతులకు యాప్ గురించి అవగాహన కల్పించాలన్నారు. కౌలు రైతులకు మాత్రం వ్యవసాయ విస్తరణ అధికారులు తమ లాగిన్ ద్వారా స్లాట్ బుకింగ్ చేయాలని సూచించారు. యాప్ నిర్వహణ, మద్దతు ధర తదితర అంశాలపై వివరించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ రీజినల్ డైరెక్టర్ మల్లేశం, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి నాగరాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి స్వరూప రాణి, జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.