సమయపాలన పాటించాలి
● వైద్య సిబ్బందికి కలెక్టర్ ఆదేశం ● డుమ్మాకొట్టిన మీర్జాపూర్ సిబ్బందిపై ఆగ్రహం
అక్కన్నపేట(హుస్నాబాద్)/హుస్నాబాద్‌రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. శనివారం ఆమె అక్కన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అలాగే.. హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలో ఎస్‌ఎస్‌టీ శిబిరాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిరోజు ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్ల వివరాలు, మందులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అలాగే.. హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలో ఎస్‌ఎస్‌టీ శిబిరంలో రిజిస్టర్లను పరిశీలించారు. ఎన్నికల దృష్ట్యా వాహనాల తనిఖీలో వీడియో రికార్డు చేయాలన్నారు. మీర్జాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ ఒక ఉద్యోగి మినహా అందరూ గైర్హాజరవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు గైర్హాజరైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు.


