
● గంటన్నరకు పైగా ఏకధాటిగా.. ● జలమయమైన లోతట్టు ప్రాంతాలు
దంచికొట్టిన వాన
దుబ్బాక: దుబ్బాకలో శనివారం సాయంత్రం వాన దంచికొట్టింది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీ నీరు రోడ్లపై నుంచి ప్రవహించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా తయారైంది. శనివారం దుబ్బాకలో అంగడి కావడంతో రైతులు, కూరగాయల వ్యాపారులు, వినియోగదారులు వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంతో పాటుగా మండలంలోని చాలా గ్రామాల్లో వర్షం కురిసింది. భారీగా వరద నీరు చేరడంతో పంటలకు నష్టం ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎలా చేతికొస్తాయో అన్న ఆందోళనలో ఉన్నారు.