
వైభవంగా దసరా ఉత్సవం
జిల్లాలో ఘనంగా కొనసాగినదసరా పండుగ
ఉదయం నుంచే ఆలయాలు కిటకిట
సాయంత్రం రావణసురకటౌట్‌ల దహనాలు
ప్రశాంత్‌నగర్( సిద్దిపేట): జిల్లాలోని ప్రజలు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. గురువారం ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు తరలివచ్చి శమీ పూజ నిర్వహించి, పాలపిట్టను దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా అమ్మవార్లు, హనుమాన్ ఆలయాల వద్ద వాహనాలకు పూజలు నిర్వహించారు. దీంతో ఏ ఆలయం వద్ద చూసినా భారీ లైన్లు కన్పించాయి. జిల్లా కేంద్రంలోని కోటిలింగాల ఆలయం, రంగదాంపల్లి హనుమాన్ ఆలయం, నర్సాపూర్ హనుమాన్ ఆలయం, రూరల్ పోలీస్‌స్టేషన్ హనుమాన్ ఆలయం, శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాలలో శమీపూజ నిర్వహించారు. లాల్‌కమాన్, నర్సపూర్ హనుమాన్ ఆలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. సాయంత్రం ఆలయాల వద్ద రావణ దహనం నిర్వహించారు. దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నీరు, పండ్లు, ఆహరపదార్థాలను ఉచితంగా పంపిణీ చేశారు.
పిల్లలకు సంస్కృతిని నేర్పించాలి
జిల్లా కేంద్రంలోని ఆలయాల వద్ద జరిగిన దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూరల్ పోలీస్ స్టేషన్ హనుమాన్ ఆలయంలో వెండి కిరీటాన్ని అందించారు. అనంతరం ఆలయాల వద్ద పాలపిట్టను ఎగురవేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ...చిన్నారులకు మన సంస్కృతి, సాంప్రదాయాలను నేర్పించాలన్నారు. దేశానికి మంచినీళ్ల పథానికి తెలంగాణ దిక్సూచిగా నిలిచిందని తెలిపారు. సిద్దిపేటకు అన్ని రకాల విద్యా సంస్థలను తీసుకువచ్చామన్నారు. కాళేశ్వరంతో రంగనాయకసాగర్ జలకళతో కళకళలాడుతుందన్నారు. కాశీ పురోహితులు సిద్దిపేటకు వచ్చి హారతి ఇవ్వడాన్ని చూస్తే సాక్షాత్తూ కాశీని తలపించిందన్నారు.

వైభవంగా దసరా ఉత్సవం