
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిద్దాం
ఉమ్మడి మెదక్ జిల్లా
ఇన్‌చార్జ్ మంత్రి గడ్డం వివేక్
ప్రశాంత్‌నగర్(సిద్ధిపేట): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేద్దామని ఉమ్మడి జిల్లా మెదక్ ఇన్‌చార్జ్ మంత్రి గడ్డం వివేక్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిద్ధిపేటలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలతో స్థానిక ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ...స్థానిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సీట్లు గెలుపొందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పని చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. అందుకోసం నాయకులు, కార్యకర్త ప్రజల్లో మమేకం అవ్వాలని సూచించారు. రాజకీయ ఉనికి కాపాడుకునేందుకే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కావాలని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వన దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించారు. గంగమ్మకు పూజలు చేసి మంజీరా నదిలో ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేసి నిమజ్జనం చేశారు. కాగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాలను శుక్రవారం ఏడుపాయల మంజీరా నదిలో నిమజ్జనం చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో రావడంతో జనసంద్రంగా మారింది. రెండవ బ్రిడ్జిపై ట్రాఫిక్ జాం అయి వాహనాలకు అంతరాయం ఏర్పడింది. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. భక్తులు రాజగోపురంలోని దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.