
దారి.. వెళ్లేదెలా మరి!
ఏకధాటి వర్షాలకు రోడ్లన్నీ ఛిద్రం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అసలే నాసిరకం పనులు.. ఆపై ఏకధాటి వర్షాలు.. వరదలు.. ఇంకేముంది గ్రామీణ రహదారులను ఛిద్రం చేశాయి. మారుమూల గ్రామీణ రోడ్లే కాదు.. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారులు సైతం ధ్వంసమయ్యాయి. ఇటు ఎల్బీనగర్ నుంచి అటు బాటసింగారం వరకు విజయవాడ రహదారిపై అడుగుకో గుంతతేలింది. అష్ట వంకరలు తిరిగి.. అనేక మలుపులతో నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్న బీజాపూర్ జాతీయ రహదారి (అప్పా జంక్షన్ నుంచి చేవెళ్ల వరకు) పూర్తిగా దెబ్బతింది. శంషాబాద్ నుంచి షాద్‌నగర్ వరకు ఉన్న బెంగళూరు జాతీయ రహదారి సహా పహడీషరీఫ్ నుంచి ఆమనగల్లు వరకు విస్తరించి ఉన్న శ్రీశైలం జాతీయ రహదారి, బీఎన్‌రెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా మాల్ వరకు విస్తరించి ఉన్న నాగార్జునసాగర్ రోడ్డు, షాద్‌నగర్ నుంచి తాండూరు వెళ్లే మార్గం, కోకాపేట నుంచి శంకర్‌పల్లి మీదుగా చేవెళ్ల వెళ్లే మార్గం ఎక్కడికక్కడ గుంతలు తేలాయి. దెబ్బతిన్న రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన రోడ్ల భవనాలశాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలు అటు వైపు దృష్టిసారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాకపోకలకు ఇబ్బందులు
ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లపై నిలిచి ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పాటు రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో రోడ్డుపై ఉన్న తారు, సీసీ దెబ్బతిని కంకర తేలుతోంది. దెబ్బతిన్న ఈ రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. వాహనాల డిస్క్‌లు, క్లచ్ ప్లేట్‌లు, బ్రెక్‌లు దెబ్బతింటున్నాయి. రిపేర్ల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆయా వాహనాలపై ప్రయాణించే వృద్ధుల డిస్క్(ఎముక)లు దెబ్బతిని తీవ్రమైన ఒంటి నొప్పులో బాధపడుతూ చికిత్సల కోసం ఆస్పత్రుల్లో చేరుతున్నారు. మాడ్గుల, మంచాల, యాచారం, కేశంపేట, తల కొండపల్లి, నందిగామ, కొత్తూరు, కొందుర్గు, చౌద రిగూడ, శంకర్‌పల్లి, మొయినాబాద్ మండల కేంద్రాల నుంచి మారుమూల గ్రామాలకు వెళ్లే పంచాయతీరాజ్ రోడ్లు పూర్తిగా కంకరతేలి, ప్రమాదకరంగా మారాయి.
అబ్దుల్లాపూర్‌మెట్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలు
షాబాద్: బురదమయంగా మారిన
ఎర్రోనిగూడ రోడ్డు

దారి.. వెళ్లేదెలా మరి!

దారి.. వెళ్లేదెలా మరి!