యూనిక్‌ టోకరా! | - | Sakshi
Sakshi News home page

యూనిక్‌ టోకరా!

Apr 14 2026 8:40 AM | Updated on Apr 14 2026 8:40 AM

జనాలను నిలువునా ముంచిన ఫైనాన్స్‌ సంస్థ

డబ్బు రెట్టింపు అంటూ డిపాజిట్లు సేకరణ

కరోనా నుంచి మొహం చాటేస్తున్న వైనం

ఉమ్మడి జిల్లాలో రూ.500 కోట్లు సేకరించిన సంస్థ

న్యాయం పోరాటానికి సిద్ధమవుతున్న ఏజెంట్లు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌ :

మొన్న సహారా, నిన్న మెటా ఫండ్‌, నేడు యూనిక్‌.. సంస్థల పేరు ఏదైనా అందరి లక్ష్యం ఒకటే.. ఏదో ఒకరకంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడం ఆపై మొహం చాటేయడం. తాజాగా యూనిక్‌ అనే ఉత్తారాదికి చెందిన సంస్థ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భారీ స్కాంకు పాల్పడిందని ఖాతాదారులు, ఏజెంట్లు నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఒక్క ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే ఏకంగా రూ.500 కోట్ల వరకు ఖాతాదారుల నుంచి డబ్బులు సేకరించి ఇప్పుడు వారిని రేపు..మాపు.. అంటూ తిప్పుకుంటుందని బాధితులు వాపోతున్నారు. ఆరేళ్లలో డబ్బులు రెట్టింపు చేస్తామంటూ తీయని మాటలు చెప్పిన సంస్థ తీరా గడువు ముగిసి నాలుగేళ్లు గడుస్తున్నా ఎలాంటి డబ్బు చెల్లించకపోవడంతో బాధితులంతా ఏజెంట్ల ఇళ్ల మీదకు వస్తున్నారు. దీంతో ఏజెంట్లంతా కంగారుపడి యూనిక్‌ సంస్థపై న్యాయపోరాటం చేయాలని తీర్మానించుకున్నారు. వీరంతా కలిసి ఇటీవల కరీంనగర్‌లో సమావేశం పెట్టుకుని డిపాజిటర్ల డబ్బులు వెనక్కి తీసుకురావాలని నిర్ణయించారు.

అసలేం జరిగింది?

వాస్తవానికి ఇది ఫైనాన్స్‌ సంస్థ కాదు. దీని వ్యవహారం చూస్తుంటే మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ను తలపిస్తోంది. పదకొండేళ్ల క్రితం అంటే 2015 నుంచి ఇది తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు ప్రారంభించింది. కేవలం ఆరేళ్లలో మీ డబ్బులు రెట్టింపు చేస్తామంటూ కస్టమర్లకు ఎరవేసింది. తెలంగాణలో ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌తోపాటు, నల్లగొండ జిల్లాలో భారీగా డిపాజిట్లు సేకరించింది. సంస్థ కార్యకలాపాలు, హామీలకు ఆకర్షితులైన పలువురు ఈ సంస్థలో ఏజెంట్లుగా చేరారు. సంస్థ లక్ష్యాలు సామాన్యులకు వివరించి.. కేవలం ఆరేళ్లలో డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించారు. 24 గంటలు అదే పనిలో ఉండి డిపాజిటర్ల నుంచి భారీగా డబ్బులు కట్టించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రూ.500 కోట్ల వరకు సేకరించినట్లు సమాచారం. కరోనా నాటికి డిపాజిటర్ల మెచ్యూరిటీ గడువు పూర్తయింది. అయినా యూనిక్‌ సంస్థ డబ్బులు చెల్లించకుండా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తోంది. దీంతో బాధితులు, ఏజెంట్లు అంతా కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నారు.

మెటాను మించిన యూనిక్‌..

ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించిన సంస్థ ఇటీవలి కాలంలో మరోటి లేదంటే అతిశయోక్తి కాదు.. గతంలో కరీంనగర్‌ కేంద్రంగా వెలుగుచూసిన జీబీఆర్‌ క్రిప్టో కరెన్సీ రూ.100 కోట్ల వరకు కరీంనగర్‌ నుంచి వసూలు చేసింది. అనంతరం ఇదే కరీంనగర్‌ కేంద్రంగా ఓ మాజీ కార్పొరేటర్‌ ఏకంగా మెటాఫండ్‌ పేరుతో రూ.300 కోట్ల వరకు ప్రజల నుంచి సేకరించారు. ఈ డబ్బులు ఏకంగా దేశం దాటి పోయాయి. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు అందరినీ పోలీసులు అరెస్టు చేసినా.. డబ్బుల రికవరీలో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. తాజాగా ‘యూనిక్‌’ కేసులో రూ.500 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటం ఆసక్తి రేపుతోంది. ఈ విషయమై జిల్లాలో పలు స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. కేసులు పెడితే.. డబ్బులు వెనక్కి రావంటూ నేటికీ యూనిక్‌ సంస్థ ప్రతినిధులు డిపాజిటర్లను మభ్యపెడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement