సిరిసిల్ల క్రైం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 33 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత పోలీస్‌స్టేషన్ల అధికారులకు వెంటనే తెలియజేసి, చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రత వ్యవస్థలను బలోపేతం చేస్తున్నట్లు ఏఎస్పీ చంద్రయ్య పేర్కొన్నారు. ఇల్లంతకుంటలోని గ్రామపంచా యతీ ఆవరణలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ నియమాలపై అవగాహ న పెంపు కోసం అరైవ్ అలైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అతి వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సర్పంచ్ మామిడి రాజు, ఎస్సై అశోక్, ఏఎస్సై రాజయ్య, ఉపసర్పంచ్ నాగరాజుశర్మ, కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్‌కు పూర్వవైభవం తీసుకొస్తామని ము న్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవా రం అధికారులతో కలిసి విగ్రహ ప్రాంగణం, కూడలి పరిశీలించారు. మంగళవారం నిర్వహించే జయంతి సందర్భంగా వాటర్ ఫౌంటేయిన్, ఇతరత్ర లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కౌన్సిలర్ దార్నం అరుణ, డీఈ వాణి, ఏఈ నరసింహస్వామి, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్ పాల్గొన్నారు.
19న హిందూ సమ్మేళనం
వేములవాడ: ఈనెల 19న వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే హిందూ సమ్మేళనానికి పెద్ద ఎత్తున హిందువులు తరలిరావాలని హిందూ సమ్మేళన సమితి నాయకులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ కోరారు. హిందూ సమ్మేళన సభ రాష్ట్రీయ స్వయం సేవక సంగ్ దశాబ్ది ఉత్సవం సందర్భంగా 19న సాయంత్రం 5 గంటలకు జరిగే సభ పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. నాయకులు డాక్టర్ కే.మనోహర్, బుస్స శ్రీనివాస్, మోటూరి మధు, రేగుల మల్లికార్జున్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
పోషకాహారంపై అవగాహన
సిరిసిల్లటౌన్/గంభీరావుపేట/తంగళ్లపల్లి: పోషణ పక్వాడలో భాగంగా సోమవారం పలు మండలాల్లో వంటల పోటీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గణేశనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహారం గురించి ఐసీడీఎస్ కార్యకర్తలు అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ కార్యకర్త వింధ్యారాణి, ఏఎన్‌ఎం నందిని పాల్గొన్నారు. గంభీరావుపేట, లింగన్నపేట, తంగళ్లపల్లి మండలం వేణుగోపాల్‌పూర్ గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిన్నారుల తల్లిదండ్రులకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు వనిత, రేణుక, సుశ్మిత, సర్పంచ్‌లు మల్లుగారి పద్మ, పిట్ల ఎల్లయ్య, జూపల్లి రమాదేవి, ఉపసర్పంచ్‌లు కమలాకర్‌రెడ్డి, నర్సింలు, అంగన్‌వాడీ టీచర్లు భాగ్య, రాధమ్మ, శ్రావణి, శోభ, ఉమారాణి, సునీత, వనజ, గీతబాల, రజని, పద్మ పాల్గొన్నారు.


