● గత ఫిబ్రవరి 26న నాందేడ్‌లో ఘటన ● ఆ ఘటనలోనూ వాడింది ఇదే వాహనంగా అనుమానం ● ఏటీఎం మిషిన్ చోరీపై వేగంగా దర్యాప్తు ● కూపీ లాగుతున్న పోలీసులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం మిషిన్ అపహరణపై పో లీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీల ఆధారంగా డాటాను విశ్లేషిస్తున్నారు. బ్యాంకు నుంచి డాటా రావాల్సి ఉందని సమాచారం. సంఘటన జరిగిన రోజు ఏటీఎం మిషిన్ వద్ద గల సీసీ కెమెరాల డాటా కొంత మేరకు షార్ట్ సర్క్యూట్‌కు గురైంది. దీంతో డాటా కోసం పోలీసులు ముంబైలోని హెడ్‌క్వార్టర్‌ను సంప్రదించినట్లు తెలిసింది. వారి నుంచి పూర్తిస్థాయి డాటా రాగానే నిందితులను గుర్తించే అవకాశం ఉంది. ఆ దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు.
బ్యాంకు డాటా కోసం
ఏటీఎం మిషిన్ వద్ద బ్యాంకు అధికారులు అమర్చిన సీసీ కెమెరాలతోపాటు ఇతర పరికరాలకు సంబంధించిన డాటా రావాల్సి ఉంది. బ్యాంకు ప్రధా న కార్యాలయం ముంబైలో ఉండడంతో అక్కడి నుంచి పూర్తిస్థాయి డాటాను తెప్పించేందుకు బ్యాంకు అధికారులు పోలీసులకు సహకరిస్తున్నారు.
నాందేడ్‌లో ఇదే తరహా చోరీ
మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఇదే తరహా ఘటన గత ఫిబ్రవరి 26న జరిగింది. నాందేడ్‌లో ఇదే బొలేరో వాహనంతో ముగ్గురు వ్యక్తులు వెళ్లి అక్కడి ఏటీఎం మిషిన్‌ను అపహరించారు. అక్కడ, ఇక్కడ ఒకే వాహనం వాడడంతో దొంగలను గుర్తించడం పోలీ సులకు సులువుగా మారింది. మహారాష్ట్ర పోలీసులతో జిల్లా పోలీసులు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.
మహారాష్ట్రకు వెళ్లిన ప్రత్యేక బృందం
నాందేడ్‌లో జరిగిన సంఘటన వివరాలు తెలుసుకునేందుకు 12 ప్రత్యేక బృందాల్లోని ఒక పోలీసు బృందం అక్కడికి వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అక్కడ జరిగిన సంఘటన తర్వాత పరిణామాలు సేకరించడానికి వెళ్లినట్లు సమాచారం.
ఫేక్ నంబర్‌ప్లేట్‌తో బురిడీ
ఏటీఎం మెషిన్ దొంగతనానికి ఉపయోగించిన బొలెరో వాహనానికి ఫేక్ నంబర్ ప్లేట్ అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఏటీఎం మిషన్ అపహరణపై పోలీసుల దర్యాప్తు వేగంగా ముందుకెళ్తున్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లోగా దొంగలను గుర్తించే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.


