● చివరి స్థానంలో జిల్లా ● రాష్ట్రస్థాయిలో 35వ స్థానం ● సెకండియర్‌లో 58.69 శాతం ● ఫస్టియర్‌లో 49.05 శాతం
సిరిసిల్ల: ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. రాష్ట్ర స్థాయిలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఆదివారం వెల్లడించారు. జిల్లా ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 49.05 ఉత్తీర్ణత శాతంతో అట్టడుగు స్థానంలో ఉండగా.. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోనూ 58.69 శాతంతో ఆఖరు స్థానం దక్కింది. బాలుర కంటే.. బాలికలు కాస్త మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించారు. రాష్ట్ర స్థాయిలో ఆఖరు స్థానం జిల్లాకు రావడం విద్యారంగాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో చివరి స్థానం 35వ ర్యాంకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావడం జిల్లాలోని విద్యారంగ పరిస్థితి అద్దం పడుతుంది. జిల్లాలోని కేజీబీవీ విద్యార్థినులు మెరుగైన మార్కులతో సత్తా చాటుకున్నారు. కేజీబీవీ వేములవాడలో ఏఐఎంఎల్ ఫస్టియర్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండియర్‌లో 328 మంది విదార్థులు పరీక్షలు రాయగా.. 278 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 478 మంది పరీక్షలు రాయగా.. 400 మంది ఉత్తీర్ణత సాధించారని జిల్లా విద్యాధికారి డాక్టర్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని ఏడు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఇంటర్ ఫస్టియర్ 437 మంది పరీక్షలు రాయగా.. 327 మంది ఉత్తీర్ణులు అయ్యారు. సెకండియర్‌లో 417 మంది పరీక్షలు రాయగా.. 354 మంది పాస్ అయ్యారు. బద్దెనపల్లి సాంఘిక గురుకుల కశాశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించిందని జిల్లా సమన్వయకర్త జె.జె.థెరిస్సా తెలిపారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థి కె.శశికుమార్ ఎంపీసీలో 982/1000 మార్కులు సాధించారు. మొదటి సంవత్సవరంలో ఎస్.శ్రీహిత ఎంపీసీలో 463/470 మార్కులు సాధించారు.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 13 నుంచి 21 వరకు రోజూ రెండు పూటలా నిర్వహిస్తారు. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి 25 వరకు రెండు పూటలా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 13 నుంచి 20 వరకు విద్యార్థి చదివిన కాలేజీల్లోనే పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో చెల్లించరాదని డీఐఈవో తెలిపారు.
జి.శ్యామల,
కేజీబీవీ మర్రిపల్లి 984/1000, బైపీసీ
మమత,
కేజీబీవీ, మర్రిపల్లి 466/470
కీర్తన,
కేజీబీవీ, సిరిసిల్ల 436/440, బైపీసీ
గడిల మమత, కేజీబీవీ రుద్రంగి 466/470, ఎంపీసీ
ఎం.శ్రీజ,
కేజీబీవీ, సిరిసిల్ల 435/440
సీ.హెచ్.దివ్యచైత్ర, కేజీబీవీ, తంగళ్లపల్లి 488/500
ఎల్.శృతిక,
కేజీబీవీ, తంగళ్లపల్లి 490/500
జి.గాయత్రీ,
కేజీబీవీ, బోయినపల్లి 482/500


