కోనరావుపేట/రుద్రంగి/వేములవాడరూరల్: ఇందిరమ్మ ఇళ్లతో గ్రామాల్లోని నిరుపేదల కుటుంబాల్లో సంతోషం కలుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం మల్కపేట, రుద్రంగి, వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి గృహాల ప్రవేశాలకు హాజరై లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్‌పాషా, సర్పంచులు బోయిని దేవరాజు, అప్పాల భూషణం, బానోత్ నరేశ్, గండి లక్ష్మీనారాయణ, సతీష్‌కుమార్, అడ్డిక లక్ష్మి, ఉపసర్పంచ్ మాడిశెట్టి అభిలాశ్, ఏఎంసీల చైర్మన్లు చెలుకల తిరుపతి, రొండి రాజు, రూరల్ పార్టీ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్, బొడ్డు రాములు పాల్గొన్నారు.
బస్సు ప్రారంభం
ఇల్లంతకుంట(మానకొండూర్): సిరిసిల్ల ఆర్టీసీ బస్టాండ్ నుంచి బోటుమీదపల్లె, సిరికొండ, దాచారం, పెద్దలింగాపురం మీదుగా ఇల్లంతకుంట వరకు ప్రయాణించే బస్సును ఆదివారం సర్పంచ్ గౌరవేణి శివాని ప్రారంభించారు. నెల రోజుల క్రితం ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రకాశ్‌రావు గ్రామాల సర్పంచుల ప్రతిపాదన మేరకు రూట్ సర్వే చేశారు. మండలంలోని బోటుమీదిపల్లెకు బస్సు చేరుకోగానే సర్పంచ్ గౌరవేని శివాని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సిరికొండలో సర్పంచ్ గొడుగు విఠల్ ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి దాచారం మీదుగా ఇల్లంతకుంటకు ఉదయం తొమ్మిది గంటలకు చేరుకుంది. ప్రతి రోజు రెండు ట్రిప్పులు నడుస్తుందని డ్రైవర్, కండక్టర్లు నర్సయ్య, గణేశ్ తెలిపారు.
మేడే కరపత్రం ఆవిష్కరణ
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రెస్‌భవన్‌లో ఆదివారం 140వ మే డే కరపత్రాన్ని ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర నాయకులు సోమిశెట్టి దశరథం ఆవిష్కరించారు. దశరథం మాట్లాడుతూ మేడే సంబరాల వెనుక అనేకమంది కార్మికుల ప్రాణత్యాగాలు దాగి ఉన్నాయన్నారు. సిరిసిల్లలోని జూనియర్ కాలేజీ మైదానం నుంచి పాతబస్టాండ్, పెద్దబజార్ల మీదుగా శాంతినగర్ చౌరస్తాలోని ఏఐఎఫ్టీయూ న్యూ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కిశోర్, భామండ్ల రవీందర్, కూరపాటి సతీశ్, గుజ్జ దేవదాస్, రవి, సత్తయ్య, రాంప్రసాద్, సునీల్ పాల్గొన్నారు.
రైస్‌మిల్లులో రేషన్ బియ్యం
వేములవాడఅర్బన్: వేములవాడ పట్టణం చెక్కపల్లిరోడ్డులోని హరిహర రైస్‌మిల్లులో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లయ్ అధికారులు ఆదివారం దాడులు చేశారు. దాదాపు 450 క్వింటాళ్ల రేషన్ సన్నబియ్యం ఉన్నట్లుగా గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. సుమారు 6 గంటల పాటు అధికారులు తనిఖీ నిర్వహించి కేసు నమోదు చేశారు. రైస్‌మిల్లులో పెద్ద ఎత్తున రేషన్ సన్న బియ్యం పట్టుబడగా క్వింటాళ్ల కొద్ది కొనుగోలు చేసి అక్రమ రవాణా ద్వారా తరలిపోయిన తీరుపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. దాడుల్లో విజిలెన్స్ సీఐ ప్రశాంతరావు, తహసీల్దార్ దినేశ్‌రెడ్డి, సివిల్ సప్లయ్ డీటీ సత్యనారాయణ పాల్గొన్నారు.


