మల్కపేట రిజర్వాయర్ ద్వారా ఆయకట్టుకు వెళ్తున్న నీరు
కనగర్తి వద్ద కాల్వలో పారుతున్న
గోదావరి జలాలు
సిరిసిల్ల: సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలు సముద్ర మట్టానికి 1,250 అడుగుల ఎత్తులో ఉన్న మెట్టప్రాంతాలు. ఇక్కడ భూములకు నీరు లేక.. బావులు తవ్వితే బండలు.. బోర్లు వేస్తే దుమ్ము లేసే దుస్థితి. వందలాది అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్కనీరు రాని వైనం. దశాబ్దాల కిందట ఇక్కడి యువతకు ఉపాధి లేక దుబాయి.. ముంబాయికి పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లే పరిస్థితులు. ఇప్పుడు కాలం మారింది. ఉన్న ఊరిలోనే మెరుగైన ఉపాధికి బాటలు పడుతున్నాయి. ఎక్కడో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి జలాలు రాజన్నసిరిసిల్ల జిల్లాకు చేరాయి. నిండు వేసవిలో గోదావరి జలధారలు పారుతున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టుల పుణ్యమా అని మధ్యమానేరు జలాశయానికి, వేములవాడ మండలం ఫాజుల్‌నగర్ రిజర్వాయర్‌కు, కూడెల్లి ద్వారా ఎగువమానేరుకు, రంగనాయకసాగర్ ద్వారా ముస్తాబాద్ ప్రాంతాలకు గోదావరి జలాలు చేరడంతో పసిడి పంటలకు ఊపిరి పోసినట్లు అయింది. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో ఎగువ మానేరు కాల్వల నీరు సాగుతుంది. ఇల్లంతకుంటలో అన్నపూర్ణ రిజర్వాయర్ సాగు నీరు అందిస్తుంది. తంగళ్లపల్లి మండలంలోని గ్రామాలకు రంగనాయకసాగర్ చేరింది. ఇలా జలం మెట్ట భూములకు చేరడంతో జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాసంగి సీజన్‌లో సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఒక్క వరి పంటనే 1,83,850 ఎకరాల్లో సాగైంది అంటే.. అది గోదావరి జలాల చలువే. మండే ఎండల్లో గోదావరి జలాలు జిల్లాలో పంటలకు ప్రాణం పోశాయి.


