బోయినపల్లి(చొప్పదండి): విద్యుత్ వినియోగదారుల సమస్యలు నెల రోజుల్లో పరిష్కరించాలని నిజామాబాద్ సీజీఆర్‌ఎఫ్ చైర్మన్–11, టీజీఎన్పీడీసీల్ ఎరుకల నారాయణ సూచించారు. బోయినపల్లిలోని రైతువేదికలో బోయినపల్లి, కోనరావుపేట, వేములవాడ అర్బన్ మండలాలకు సంబంధించి విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక శుక్రవారం నిర్వహించారు. మొదట సర్పంచులు ఏనుగుల కనకయ్య, కౌడగాని వెంకటేశ్, శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని కోరారు. లూజ్‌వైర్లు ఉన్న చోట మిడిల్‌పోల్స్, రోడ్ల వెంట చిన్నపోల్స్ తీసి, పెద్దపోల్స్ వేయాలని కోరారు. ఇళ్ల పైనుంచి వెళ్తున్న హైటెన్షన్ వైర్లు తొలగించాలని విన్నవించారు. టీజీఎన్పీడీసీఎల్ టెక్నికల్ మెంబర్ సలంద్ర రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ షేర్ల సత్యనారాయణ, సీజీఆర్‌ఎఫ్ మెంబర్ మర్రిపెల్లి రాజాగౌడ్, ఎస్‌ఈ భిక్షపతి, డీఈ వెంకటరమణ, ఏడీఈ అనిల్‌కుమార్, ఏఈ ప్రశాంత్, కిసాన్‌సంఘ్ నాయకులు సంపత్‌రావు పాల్గొన్నారు. సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ ఎరుకల నారాయణను సిరిసిల్ల పౌరసంక్షేమ సంఘం అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు చేకోట అనిల్‌కుమార్, టెక్స్‌టైల్స్ పార్క్ అసోసియేషన్ లక్ష్మీనారాయణ, బుజ్జ భూమేశ్ సత్కరించారు.


