● ఆరేళ్లుగా అన్నదాతల నిరీక్షణ ● సాదా బైనామాలపై రైతుల ఆశలు ● కొత్త మార్గదర్శకాలు జారీ ● 15,056 మంది రైతుల నిరీక్షణ
ఇతను కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన ఎల్లాల లింగారెడ్డి. ఇతను సర్వే నంబరు 488లో 13 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశారు. సాదాబైనామాల ద్వారా భూములు కొనుగోలు చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం అవకాశం కల్పించగానే 2020 అక్టోబరు 28న మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేశాడు. కానీ ఇప్పటి వరకు అతని దరఖాస్తుకు మోక్షం లభించలేదు. ధరణి రావడంతో ఆ దరఖాస్తులకు మోక్షం లభించలేదు. ఇప్పుడు భూభారతిలో ఆశలు చిగురించాయి.
ఇతను కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన వంగపల్లి పర్శరాములు. పర్శరాములు సర్వే నంబరు 213లో 1.15 ఎకరాల భూమిని సాదాబైనామా ద్వారా కొని, సాగు చేసుకుంటున్నారు. కానీ ఇతని పేరిట భూమి మార్పిడి కాలేదు. మీసేవ కేంద్రం ద్వారా సాదాబైనామాతో మ్యూటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ మోక్షం లభించలేదు. ఇలాంటి వారు జిల్లాలో 15వేల మంది రైతులు ఉన్నారు.
సిరిసిల్ల: సాదాబైనామాల ద్వారా భూమి కొనుగోలు చేసిన రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. రాష్ట్రంలో సాదాబైనామాలకు అవకాశం కల్పిస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 15,056 మంది రైతులు దరఖాస్తు చేసుకుని, ఎదురుచూస్తున్నారు.
ఆరేళ్లుగా ఎదురుచూపులే
రాష్ట్ర ప్రభుత్వం 2020 అక్టోబరు 12న సాదాబైనామాలకు అవకాశం కల్పించింది. 2020 అక్టోబరు 31తో గడువు ముగిసిపోయినా.. నవంబరు 10 వరకు పొడగించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా మీసేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో 15,056 మంది రైతులు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. మొన్నటి వరకు అమలులో ఉన్న కొత్త రెవెన్యూ చట్టంలో సాదాబైనామాల ఊసే లేదు. సాదాబైనామాలు ఉన్నా రికార్డుల్లో మార్పులు, చేర్పులు వీలు కాలేదు. పాత రెవెన్యూ చట్టం ప్రకారం సాదాబైనామాలతో హక్కులు కల్పించే అవకాశం ఉంది.
సర్కారు నిర్ణయంపై ఆశలు
సాదా బైనామాలకు అవకాశం కల్పిస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించడంతో దరఖాస్తులు చేసుకున్న రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇటీవల ప్రభుత్వం నూతనంగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ లోకేశ్‌కుమార్ తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు. దీని ప్రకారం 2020 అక్టోబరు 12వ తేదీ నుంచి నవంబరు 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారి సాదాబైనామాలు పరిష్కరించాలని ఆదేశించారు.
జిల్లాలో దరఖాస్తుల వెల్లువ
జిల్లాలో సాదాబైనామాల కోసం అత్యధికంగా కోనరావుపేట మండలంలో 2,690 మంది దరఖాస్తు చేశారు. అత్యల్పంగా రుద్రంగిలో 162 దరఖాస్తులు చేసుకున్నారు. వీర్నపల్లి మండలంలో 379, బోయినపల్లిలో 764, చందుర్తిలో 1,259, గంభీరావుపేటలో 1,403, ఇల్లంతకుంటలో 1,536, ముస్తాబాద్‌లో 1,685, సిరిసిల్లలో 428, తంగళ్లపల్లిలో 1,776, వేములవాడలో 675, వేములవాడరూరల్‌లో 1,072, ఎల్లారెడ్డిపేటలో 1,227 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అప్పట్లో ఆన్‌లైన్ కష్టాలు
సాదాబైనామాల అమలుకు మీసేవ కేంద్రాల్లో నేరుగా దరఖాస్తు చేశారు. భూమి అమ్మిన వ్యక్తి వివరాలతోపాటు కొనుగోలు చేసిన వారి సమాచారం, సర్వేనంబరు, ఆధార్‌కార్డు నంబర్, పొటో, ఫింగర్‌ప్రింట్, లేదా ఐరిష్ నమోదు చేసి మీసేవ కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో వీటిని అప్‌లోడ్ చేశారు. గ్రామ కంఠం స్థలాలకు సర్వేనంబరు లేక ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. ధరణి పోర్టల్‌లో కొన్ని సర్వే నంబర్లు నమోదు కాలేదు. దీంతో సాదాబైనామా పత్రం ఉన్నా ఆన్‌లైన్‌లో నమోదుకు ఇబ్బందులు ఎదురయ్యాయి.


