వేములవాడ: రైతుల చెంతకు విద్యుత్ సేవలు వస్తున్నాయని వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పేర్కొన్నారు. ఎన్పీడీసీఎల్ చేపట్టిన పొలంబాట గురువారం 15వ వార్డు పరిధిలోని లాలపల్లిలో నిర్వహించారు. విద్యు త్ శాఖ ఏఈ సిద్ధార్థతో కలిసి చైర్మన్ రాజు పొలాల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయడం, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించడం వంటి పనులు చేయాలని సూచించారు. కిలోమీటర్ పరిధిలో కొత్త కనెక్షన్లు పొందేందుకు రైతులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
సిరిసిల్ల: విద్యార్థి ఉద్యమాలకు మార్గదర్శకుడు, పీడీఎస్‌యూ సంస్థాపకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి 54వ వర్ధంతి సభలను ఈనెల 10 నుంచి 14 వరకు నిర్వహిస్తున్నట్లు పీడీఎస్‌యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు లోకిని రమేశ్ తెలిపారు. స్థానిక వికాస్ డిగ్రీ కాలేజీ వద్ద గురువారం పోస్టర్లను ఆవిష్కరించారు. రమేశ్ మాట్లాడుతూ జార్జిరెడ్డి పోరాటమార్గం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కుతాటి రాణాప్రతాప్, జిల్లా నాయకులు అభిలాశ్, ఆనంద్, రవి, శ్రీకాంత్, చరణ్, కావ్య, మౌనిక పాల్గొన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. కెరియర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో ఎంపవర్‌మెంట్ 24/7, కేలిబర్ కంపెనీలు పాల్గొన్నాయి. 50 మంది డిగ్రీ ఫైనలియర్ విద్యార్థినులు ఎంపికయ్యారు. వీరిని ప్రిన్సిపాల్ జయ అభినందించారు.
ఎన్‌ఎస్‌ఎస్ సర్టిఫికెట్ల పంపిణీ
మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ వార్షిక ప్రత్యేక శిబిరాల్లో చురుగ్గా వలంటీర్లకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జి.జయ మాట్లాడుతూ సామాజిక సేవ ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నారు. వైస్ ప్రిన్సిపాల్ రెహానా ఇఫత్, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్ర ధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈమేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. గిరిధర్‌రెడ్డిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతీ స్కూల్‌లో బోధనేతర సిబ్బందిని కేటాయించాలి
వేములవాడరూరల్: ప్రతీ పాఠశాలలో ఒక్కరినైనా బోధనేతర సిబ్బందిని నియమించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి లక్ష్మణ్ కోరారు. ఎస్‌టీయూ జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశం వేములవాడలోని ప్రభుత్వ హైస్కూల్‌లో గురువారం జరిగింది. లక్ష్మణ్ మాట్లాడుతూ వెంటనే పీఆర్సీ ప్రకటించాలని కోరారు. పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, పెన్షనర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని, ప్రీపైమరీ తరగతులను ప్రారంభించాలని కోరారు. యాదగిరి, రామంచ రవీందర్, బత్తిని సత్యనారాయణగౌడ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


