నిబంధనల అతిక్రమణ నిజమే
తేల్చిన జిల్లా టాస్క్‌ఫోర్స్
భవనాన్ని సీజ్ చేయించిన ఆర్డీవో వెంకటేశ్వర్లు
షాప్ మార్చడానికి పక్షం రోజుల గడువు
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని ఓ షాపింగ్‌మాల్ నిబంధనలు అతిక్రమణ నిజమేనని అధికారుల విచారణలో తేలింది. స్థానిక భావనరుషినగర్ ఏరియాలో కొద్ది రోజుల క్రితం వాసవి వస్త్రాలయాన్ని ప్రారంభించారు. జీ+3 రెసిడెన్షియల్ అనుమతులతో భవనాన్ని నిర్మించారు. ఇందులోని రెండు ఫ్లోర్లలో వాసవి షాపింగ్‌మాల్‌ను నిర్వహిస్తున్నారు. షాపింగ్‌మాల్ నిర్వహణలో నిబంధనల అతిక్రమణపై ఈనెల 2న ‘సాక్షి’లో ‘షాపింగ్ క‘మాల్’ పేరుతో కథనాన్ని ప్రచురితమైంది. దీనికి జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పందించారు. గురువారం షాపింగ్ మాల్‌ను సందర్శించి సీజ్ చేశారు.
డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ దాడులు
రెసిడెన్షియల్ భవనంలో యజమాని కమర్షియల్‌కు అద్దెకివ్వడంతోపాటు అనుమతి లేకుండానే నాలుగో అంతస్తును నిర్మించినట్లు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. వెంటనే భవన యజమానికి నోటీసులు అందించి సీజ్ చేశారు. ఇక షాపింగ్‌మాల్ నిర్వహణకు సెల్ఫ్ అసెస్‌మెంట్లో ట్రేడింగ్ లైసెన్స్ పొందడం, పార్కింగ్ లేకపోవడం, ఫైర్‌సేఫ్టీ వంటి అంశాలను పరిశీలించారు. మున్సిపల్ యాక్ట్–2019 ప్రకారం అనుమతులు సరిగ్గా లేనందున భవనాన్ని పూర్తిగా సీజ్ చేస్తున్న క్రమంలో షాపింగ్‌మాల్ నిర్వాహకులు షిఫ్టింగ్ కోసం పదిహేను రోజులు గడువు కోరారు. మాల్‌లో పనిచేస్తున్న పదుల సంఖ్యలో సిబ్బంది, షాపింగ్‌మాల్ ఇంకో చోటుకు మార్చుకునేందుకుగాను అధికారులు అవకాశం కల్పించారు.
నిబంధనలు పాటించాల్సిందే
– ఆర్డీవో వెంకటేశ్వర్లు
కమర్షియల్ భవన యజమానులు, వ్యాపారులు, వ్యాపారసంస్థలు మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం అనుమతులు పొందాలని డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ టీం ఆఫీసర్, ఆర్డీవో వెంకటేశ్వర్లు తెలిపారు. భవనం అనుమతులు మూడు ఫ్లోర్లకే ఉందని, అనుమతి లేకుండానే నాలుగో అంతస్తు నిర్మించారన్నారు. షాపింగ్‌మాల్ నిర్వాహకులు కూడా నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ నుంచి ఇప్పటికే నోటీసులు అందించి గురువారం తనిఖీలు చేసినట్లు పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌లో డీఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్ కమిషనర్ ఎం.ఎ.ఖదీర్‌పాషా, ఫైర్ ఆఫీసర్ నరేందర్, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


