రోగ నిర్ధారణతో మెరుగైన వైద్యం | - | Sakshi
Sakshi News home page

రోగ నిర్ధారణతో మెరుగైన వైద్యం

Apr 10 2026 9:45 AM | Updated on Apr 10 2026 9:45 AM

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేసి, మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఎయిడ్స్‌ నియంత్రణపై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవల కోసం రోగులను కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రులకు రెఫర్‌ చేయాలని సూచించారు. ఎయిడ్స్‌ నియంత్రణపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ట్రాన్స్‌జెండర్స్‌ కోసం ప్రత్యేక వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా వైద్యాధికారి ఎస్‌.రజిత, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌ సమీపంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణ స్థలాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, ఎన్‌పీడీసీఎల్‌ సీఈ బుస్స అశోక్‌, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, సిరిసిల్ల డిప్యూటీ తహసీల్దార్‌ విజయ్‌భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ జయంతికి ఏర్పాట్లు

సిరిసిల్లటౌన్‌: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేడ్కర్‌ జయంతిని ఈనెల 14న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈమేరకు జయంతి పోస్టర్లను గురువారం ఎస్సీ సంక్షేమశాఖ అధికారి రవీందర్‌రెడ్డి, హౌసింగ్‌ పీడీ వెంకట మాధవరావుతో కలిసి ఆవిష్కరించారు. జయంతి వేడుకలకు వివిధ సంఘాల ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొనాలని కోరారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డిలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ మహేశ్‌ బీ గీతేతో కలిసి పాల్గొన్నారు. ఈనెల 13 నుంచి 18 వరకు అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమాలు షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలని వారు ఆదేశించారు.

నేడు మెగా హోమియో శిబిరం

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆయుష్‌ జిల్లా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం హోమియోపతి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈమేరకు కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. వ్యాధులు రాకుండా ఏం చేయాలి, వచ్చిన వ్యాధులను ఎలా నివారించుకోవాలో యోగా ద్వారా కల్పిస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఉదయం 6:30 నుంచి 7:30 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం అంబేడ్కర్‌నగర్‌ పీహెచ్‌సీలో మెగా మెడికల్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement