● డయాలసిస్ రోగి కుటుంబంపై దాడి ● క్షతగాత్రుడి కుటుంబసభ్యులపై సిబ్బంది దురుసు ప్రవర్తన
సిరిసిల్లటౌన్: జిల్లాసుపత్రిలో ధర్మం గాడితప్పుతోంది. వైద్యం కోసం వచ్చే పేదలపై రెండు రోజులుగా సిబ్బంది ప్రవర్తన హద్దులు దాటి దాడుల వరకు వెళ్లడం విమర్శలకు తావిస్తోంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన దేవరాజు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. మూడ్రోజుల క్రితం డయాలసిస్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తీసుకురాగా పేరు నమోదు చేసుకునే సమయంలో సిబ్బందితో మాటామాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకుందని, అనంతరం కొందరు సిబ్బంది తమపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ప్రాణభయంతో అక్కడి నుంచి తప్పించుకున్నామని, పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
సిబ్బంది నిర్లక్ష్యంపై నిరసన
సిరిసిల్లకు చెందిన అల్వాల భాస్కర్ బైక్‌పై నుంచి పడి కాలు విరగగా.. బంధువులు మంగళవారం రాత్రి జిల్లాసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యం అందించాలని కోరుతున్న తరుణంలో అక్కడే ఉన్న డ్యూటీ డాక్టర్, సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని భాస్కర్ కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. ఈ రెండు ఘటనల్లో నిజానిజాలు తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాదితులు ఉన్నతాధికారులను కోరారు. ఈవిషయమై జిల్లాసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా రెండు సంఘటనలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


