
మంత్రి గారూ.. మంథనికి బస్సులేవి..?
పెద్దపల్లిరూరల్: రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథనికి వెళ్లేందుకు అవసరమైన బస్సులు లేక పెద్దపల్లి ప్రాంత ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పెద్దపల్లి–మంథని నడుమ ఓ షటిల్ బస్సు ఐదు ట్రిప్పులు నడుస్తోంది. మంథనికి వెళ్లేందుకు పెద్దపల్లి బస్టాండ్‌లో నిత్యం ప్రయాణికులు పడిగాపులుగాస్తున్నారు. ఈ షటిల్ బస్సు మాత్రమే కాకుండా మరో బస్సును మంథని నుంచి కరీంనగర్ వరకు కూడా నడిపిస్తున్నామని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.
రైలు ప్రయాణికులకు ఇబ్బంది
దూర, సుదూర ప్రాంతాలకు రైళ్లలో ప్రయాణించి తిరిగి మంథని ప్రాంతంలోని తమ ఇళ్లకు వెళ్లేందుకు వచ్చే సమయాల్లో బస్సులు ఉండడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. పెద్దపల్లి– మంథని మధ్య మరిన్ని బస్సులు నడిపితేనే సౌకర్యంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ దిశగా మంత్రి శ్రీధర్‌బాబు దృష్టిసారించాలని కోరుతున్నారు.
రద్దయిన జగిత్యాల బస్సులు
పెద్దపల్లి–జగిత్యాల నడుమ ఆర్టీసీ అధికారులు జగిత్యాల డిపో బస్సులను నడిపించారు. అయితే ఆ బస్సుల మార్గం గొల్లపల్లి, చిన్నకోడూరు మీదుగా ఉండడంతో ఎక్కువమంది పెద్దపల్లి నుంచి ధర్మారం వరకే ప్రయాణించారు. దీంతో తమకు ఆశించిన ఆదాయం రాలేదని ఆ బస్సులను రద్దు చేశారు. కానీ, అవే బస్సులను పెద్దపల్లి నుంచి జగిత్యాల జిల్లాలోని పుణ్యక్షేత్రమైన ధర్మపురి మీదుగా నడిపితే సౌకర్యంగా ఉంటుందని ఈ ప్రాంతవాసులు పేర్కొంటున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయమై దృష్టి సారించాలని కోరుతున్నారు.
సమస్య పరిష్కారానికి చర్యలు
మంథని డిపోలో 52 బస్సులున్నాయి. అందులో పెద్దపల్లి మీదుగా కరీంనగర్, హైదరాబాద్‌కు 11 బస్సులు నడుస్తున్నాయి. అవి కాక మరో బస్సు పెద్దపల్లి– మంథని మధ్య ఐదు ట్రిప్పులు నడుస్తోంది. ఆ బస్సుకు అనుకున్న టార్గెట్ రావడం లేదు. కానీ, ప్రయాణీకుల నుంచి ఒత్తిడి ఉంది. బస్టాండ్‌కు రైల్వేస్టేషన్ దగ్గర ఉండడం వల్లే రైల్లో ప్రయాణించి వచ్చినవారితో రద్దీ ఒక్కసారిగా పెరుగుతున్నట్టుగా ఉంది. ఈ విషయమై దృష్టిసారించి అవసరమైన చర్యలు తీసుకుంటాం.
– శ్రావణ్‌కుమార్, డిపో మేనేజర్, మంథని