
కార్యకర్తలు కష్టపడి పని చేయాలి
గోదావరిఖని(రామగుండం): ప్రజాపాలనలో కొనసాగుతున్న అభివృద్ధి అంశాలు ప్రతీ గడపకు చేరాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సూచించారు. ఆదివారం క్యాంప్ కార్యాలయంలో అంతర్గం మండల ముఖ్య నాయకులు, గ్రామ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని, గ్రామ స్థాయి నుంచి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మమేకం కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలు, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాలన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించేలా వ్యవహరించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలాన్ని మరింత పెంచేందుకు సమష్టిగా పనిచేయాలన్నారు. పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పనులు పరిశీలన
స్థానిక గోదావరితీరంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఆదివారం పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలను కల్పించాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఈప్రాంతాన్ని పిక్నిక్ స్పాట్‌గా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. నాయకులు మహాంకాళి స్వామి, దీటి బాలరాజు, అధికారులున్నారు.