
జిల్లాలో భారీవర్షం
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని పలు ప్రాంతా ల్లో శనివారం మధ్యాహ్నం భారీవర్షం కురిసింది. పెద్దపల్లి, సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, మంథని తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో దారి కనిపించక ఎక్కడికక్కడే వాహనాలు నిలిపివేశారు. దసరాకు స్వస్థలాలకు వచ్చిన జిల్లావాసులు హైదరాబాద్, సికింద్రాబాద్ తదితర దూ రప్రాంతాలకు బయలు దేరగా.. వర్షంతో గమ్యస్థానాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు.
పంటలకు నష్టం..
కాల్వశ్రీరాంపూర్/ఓదెల(పెద్దపల్లి): కాల్వశ్రీరాంపూర్ మండలంలో వర్షం కురిసింది. పగలంతా ఎండగా ఉండి.. సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురవడంతో పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వరి పొట్ట దశలో ఉందని, పత్తి పింజరదశలో పగిలేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. వర్షంతో పత్తికాయలు కుళ్లి రాలిపోతాయని వాపోతున్నారు. ఓదెల మండలంలోనూ రోడ్లు జలమయమయ్యాయి.