
దారితప్పుతోంది!
పాతికేళ్లలోపు వయసున్న ముగ్గురు ఇటీవల ఓ హత్యాయత్నం కేసులో ఇరుక్కున్నారు. తల్లిని తిట్టాడని కక్ష పెంచు కుని ఓ ఆర్‌ఎంపీపై కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఏడాది జనవరిలో హత్యాయత్నం జరగ్గా.. నిందితులను ఈనెల ఒకటో తేదీన వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు.
గతనెల 3న గంజాయి రవాణా చేస్తూ పాతికేళ్ల లోపు వయసున్న ముగ్గురు యువకులు గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులకు చిక్కారు. గంజాయికి అలవాటుపడి, రవాణాలో కీలకపాత్ర పోషించిన వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 3కేజీ గంజాయి స్వాధీనం చేసుకుని జైలుకు పంపారు.
పలు దొంగతనాల కేసుల్లో 23ఏళ్ల యువకుడిని గతనెల 11న గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు చోరీ కేసుల్లో అతడు నిందితుడు. రూ. లక్షలకుపైగా విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.
లగ్జరీలైఫ్ కోసం పెడదారి నేరస్తులుగా మారుతున్న యువత పోలీసు కేసుల్లో ఇరుక్కొని కటకటాల పాలు హత్యాయత్నం, గంజాయి రవాణా, చోరీ కేసుల్లో వీరిదే అగ్రస్థానం
గోదావరిఖని: దేశభవిష్యత్‌కు యువతే పునాదని పెద్దలు చెబుతున్నారు. కానీ, అందుకు విరుద్ధంగా యువత పెడతోవ పడుతోంది. నూనూగు మీసాల ప్రాయంలో నేరాలకు పాల్పడుతోంది. ఆ తర్వాత జైలు జీవితం గడుపుతోంది. కారణాలేమైనా.. కొంతకాలంగా చోటుచేసుకుంటున్న చాలానేరాల్లో యు వత పాత్ర కీలకంగా ఉంటోందని పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. వ్యసనాలు, చోరీలు, హత్యాయ త్నం కేసుల్లో ఇరుక్కుని కటకటాలు లెక్కిస్తున్నారు.
బాగా చదువుకుని..
మంచి ఉద్యోగం చేస్తారనుకుంటే..
విద్యాభ్యాసం పూర్తిచేసి మంచి ఉద్యోగాలు సంపాదించి కనిపెంచిన తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన యువత.. దారితప్పుతోంది. భవిష్యత్ త రం జైలు ఊచలు లెక్కపెడుతోంది. గంజాయి రవాణా, సింగరేణిలో స్క్రాప్ చోరీలు, ఇళ్లలో దొంగతనాలు, హత్యాయత్నం, డ్రగ్స్ తరలింపు కేసుల్లో అధికంగా పట్టుబడుతోంది. అంతేకాకుండా ఓవర్ స్పీడ్, త్రిపుల్ రైడింగ్‌తోపాటు పలు కేసుల్లోనూ నూ నూగు మీసాల యువత పోలీసులకు చిక్కుతోంది.
గంజాయి కేసుల్లో అధికం..
కోల్‌బెల్ట్ పారిశ్రామిక ప్రాంతంలోని యువత గంజాయి తాగడం, విక్రయించడం, రవాణా చేయడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. వీరిలో కొంతమంది డిగ్రీ పూర్తిచేసిన వారూ ఉంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయించడం.. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడం పరిపాటిగా మారుతోంది. ఈక్రమంలో ముగ్గురు గోదావరిఖనికి చెందిన పాతికేళ్ల యువకులు ఇటీవల పోలీసులకు పట్టుబడిజైలు పాలైయ్యారు.
సింగరేణి స్క్రాప్ చోరీలో..
సింగరేణి స్క్రాప్ చోరీ కేసుల్లో యువత అధికంగా పట్టుబడుతోంది. లగ్జరీ జీవితానికి అలవాటు పడిన యువకులు.. పక్కనే ఉన్న సింగరేణి బొగ్గు గనుల్లో సొత్తును ఎత్తుకెళ్లి విక్రయించగా వచ్చిన సొమ్ముతో దర్జా జీవితాలు గడుపుతున్నారు. దీనికోసం తాము చేస్తోంది మంచి పనా, చెడుపనా? అని కూడా చూడకుండా కేసుల పాలవుతున్నారు.
చిన్న కారణంతోనే హత్యాయత్నం..
తల్లిని దూషించడానే కారణంతో పాతికేళ్లలోపు ఇద్దరు విద్యార్థులు, ఒక ఆటోడ్రైవర్ కలిసి ఇటీవల ఒక ఆర్‌ఎంపీని చంపేందుకు యత్నించారు. కత్తితో దాడిచేసి ముఖంపై విచక్షణా రహితంగా పొడిచి గాయపర్చారు దీంతో బాధితుడు ప్రాణాలు పో యేంత పనైంది. అదృష్టవశాత్తు ఆస్పత్రికి వెంటనే తరించడంతో బతికి బయటపడ్డాడు. గత జనవరిలో జరిగిన ఈసంఘటనలో ముగ్గురు యువకులను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు దృష్టి సారించాలి
వ్యసనాల బారినపడి నేరాల పాలవుతున్న యువతకు పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా కూడా నేరాల వైపు వెళ్లరని అంటున్నారు. తద్వారా నేరాల సంఖ్య తగ్గడంతోపాటు యువత భవిష్యత్‌కు బంగారు బాటలు పడుతాయని సూచిస్తున్నారు.

దారితప్పుతోంది!