
బీజేపీ పాలనలో దళితులకు రక్షణ కరువు
పీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ మానస్ కుమార్ మల్లిక్
రాయగడ: అడ్డతోవలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వ పాలనలో దళిత వర్గాలకు రక్షణ కరువు అవుతుందని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్, న్యాయవాది మానస్ కుమార్ మల్లిక్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక కాంగ్రెస్ భవన్‌లో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో దళిత వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందలేని ఎంతో మంది ఆదివాసీలు ఉపాధిని వెతుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లి అక్కడి యాజమానుల నిరంకుశత్వానికి బలవుతున్నారన్నారు. పారిశ్రామకంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో కూడా ఉపాధి అవకాశాలు కరువుతుండటం విచారకరమన్నారు.
ఓట్ల దొంగతనం..
గత సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అడ్డదారిలోనే అధికారంలోకి వచ్చిన మాట వాస్తవమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీఎం ప్యాడ్ టాంపరింగ్‌కు పాల్పడటంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయమై తన పోరాటం కొనసాగిస్తూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజలు ఇప్పటికై నా తెలుసుకొని ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చిన బీజేపీ.. అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం వాటి మాట ప్రస్తావనకై నా తీసుకురావడం లేదని ఆరోపించారు. గత 25 ఏళ్ల బీజేడీ పాలనలో కూడా చెప్పుకొదగ్గ అభివృద్ధిని ఒడిశా రాష్ట్రం సాధించలేదని ఏద్దేవా చేశారు. ఈ సమావేశంలో రాయగడ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు అప్పల స్వామి కడ్రక, డీసీసీ మాజీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ పండా, డీసీసీ ఉపాధ్యక్షుడు శంకర్షన్ మంగరాజ్, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, తదితరులు పాల్గొన్నారు.