
విద్యార్థుల ఆరోగ్యమే భవిష్యత్‌కు పునాది
కంచిలి/సోంపేట/మందస/టెక్కలి: విద్యార్థుల ఆరోగ్యం, ఆహార భద్రతే దేశ భవిష్యత్‌కు పునాది అని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సీహెచ్ విజయ ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం పలు హాస్టళ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీలు, చౌక ధరల దుకాణాలను ఆకస్మికంగా ఆయన పరిశీలించారు. విద్యార్థులకు సక్రమంగా నా ణ్యమైన భోజనం అందుతుందో లేదోనని తెలుసుకున్నారు. సోంపేట మండలంలోని వాడపాలేం వసతి గృహంలో విద్యార్థులకు వారానికి రెండు గుడ్లు అందజేస్తున్నారని విద్యార్థులు తెలపడంతో.. ఇన్‌చార్జి వార్డెన్ విజయలక్ష్మికి షోకాజ్ నోటీసులు అందజేయమని వెనుకబడిన తరగతుల జిల్లా సంక్షేమాధికారి బి.అనురాధకు ఆదేశాలు జారీ చేశారు. వనతి గృహాల్లో మెనూ సక్రమంగా అమలు చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల మేరకు విద్యార్థులకు ఇచ్చే గుడ్ల సైజ్ ఉండాలని స్పష్టం చేశారు. స్టాక్ నిర్వహణ సక్రమంగా ఉండాలని, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సుమోటోగా కేసులు నమోదు చేస్తామని వివరించారు. విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని సూచించారు. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు డీఎస్‌ఓ సూర్యప్రకాశ్, ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీరాములు, తూనికలు కొలతల శాఖాధికారి పి.చిన్నమ్మి తదితరులు ఉన్నారు.