భక్తిశ్రద్ధలతో గౌరీపౌర్ణమి | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో గౌరీపౌర్ణమి

Oct 7 2025 3:57 AM | Updated on Oct 7 2025 3:57 AM

భక్తి

భక్తిశ్రద్ధలతో గౌరీపౌర్ణమి

రాయగడ: గౌరీపౌర్ణమి సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్థానిక కండ్రవీధి, జగన్నాథ మందిరం వెనుక, మెయిన్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న నందన్న పూజల్లో భాగంగా శివపార్వతులకు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు గౌరీదేవీ వ్రతం చేశారు. పండ్లు, ఫలాలు, చీరలు, గాజులను శివపార్వతులకు సమర్పించారు. మొక్కులను తీర్చుకున్నారు.

హత్య చేస్తామంటూ

బెదిరింపులు!

రాయగడ: జిల్లాలోని పద్మపూర్‌ తోలోసాహి ప్రాంతానికి చెందిన భైరవ సాహు అనే వ్యక్తిని గత ఏప్రిల్‌ 21వ తేదీన చేతబడి చేస్తున్నాడన్న ఆరోపణతో కొందరు గ్రామస్తులు హత్య చేశారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అందుకు సంబంధించి కొందరు గ్రామస్తులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అయితే జైలు నుంచి తిరిగి వచ్చిన నిందితులు తమను ఎలాగైన హత్య చేస్తామని బెదిరిస్తున్నారని భైరవ సాహు కుటుంబీకులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు వినతుల స్వీకరణలో భాగంగా బాధిత కుటుంబీకులు ఈ మేరకు కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. హత్యకు గురైన భైరవ సాహు భార్య సంజు సాహు, కొడుకు జితు సాహు, కూతురు రస్మి సాహు తదితర కుటుంబ సభ్యులు కలెక్టర్‌ను కలసి తమ గోడును విన్నవించుకున్నారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్‌ కులకర్ణి, ఎస్‌పీ స్వాతి ఎస్‌ కుమార్‌ దీనిపై దర్యాప్తు చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ప్రాణాలు తీసిన విద్యుత్‌ తీగలు

మెళియాపుట్టి: మండలంలోని గంగరాజపురం గ్రామానికి చెందిన యువకుడు గూడపు చంటి(29) విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని మున్నాజెన్నా అనే వ్యక్తి ఇంటిపై చెట్టుకొమ్మలు విద్యుత్‌ తీగలకు తగిలి ఉండడంతో ఒడిశాలోని జంగాలపాడు గ్రామానికి చెందిన శరత్‌ అనే యువకుడు మృతుడు చంటిని ఆ కొమ్మలు తొలగించడానికి సాయంగా రమ్మన్నాడు. దీంతో విద్యుత్‌ సరఫరా ఉండగానే చెట్టు కొమ్మలను చంటి తొలగిస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అక్క దమయంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. తల్లిదండ్రులు కొద్దికాలం క్రితమే మృతి చెందారు. అతడు విజయవాడలోని ఒక ప్రైవేట్‌ కంపెనీలో వెల్డింగ్‌ కార్మికునిగా పనిచేసేవాడు. ఇటీవల వినాయక చవితికి గ్రామానికి వచ్చాడు. మంగళవారం విజయవాడ బయల్దేరి వెళ్లడానికి సిద్ధమవ్వగా.. ఇంతలో ప్రమాదం చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

కంచిలి: మండలంలోని గొల్ల కంచిలి నుంచి కంచిలి వెళ్లేమార్గంలో మఠం చెరువు సమీపంలో రైల్వేట్రాక్‌పై సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయాన్ని పలాస జీఆర్పీ పోలీసులు సోమవారం గుర్తించారు. ప్రమాదంలో మృతుని ముఖం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. మృతుడి శరీరంపై ఆరెంజ్‌, తెలుపు రంగు కలిగిన గడుల తువ్వాలు మాత్రమే ఉందని తెలిపారు. మరిన్ని వివరాలకు 94406 27567, 99891 36143 నంబర్లను సంప్రదించాలని కోరారు.

తప్పిన పెను ప్రమాదం

జి.సిగడాం: మండలంలోని మర్రివలస పంచాయతీ మానంపేట గ్రామంలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్‌ తీగ తెగిపడిన సమయంలో పెను ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన బాడిత కనకలక్ష్మికి చెందిన ఆవుకు విద్యుత్‌ తీగ తగలడంతో మృత్యువాత పడింది. ఇదే సమయంలో కనక లక్ష్మికి సైతం విద్యుత్‌ తీగ తగలడంతో షాక్‌కు గురయింది. వెంటనే గ్రామస్తులు అప్రమత్తమై కర్రలతో విద్యుత్‌ తీగను తొలగించారు. అనంతరం ఆమెను హుటాహూటిన రాజాం అస్పత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది. వ్యవసాయం కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ లైన్‌ మానంపేట మీదుగా ఉండడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వ్యవసాయ కోసం ఏర్పాటు చేసిన లైన్లు మార్చాలని కోరుతున్నారు.

భక్తిశ్రద్ధలతో గౌరీపౌర్ణమి 1
1/2

భక్తిశ్రద్ధలతో గౌరీపౌర్ణమి

భక్తిశ్రద్ధలతో గౌరీపౌర్ణమి 2
2/2

భక్తిశ్రద్ధలతో గౌరీపౌర్ణమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement