ద్విచక్ర వాహనం దొంగకు జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనం దొంగకు జైలు శిక్ష

Oct 7 2025 3:57 AM | Updated on Oct 7 2025 3:57 AM

ద్విచక్ర వాహనం దొంగకు జైలు శిక్ష

ద్విచక్ర వాహనం దొంగకు జైలు శిక్ష

నరసన్నపేట: ద్విచక్ర వాహనం దొంగతనం కేసులో సారవకోట మండలం బుడితికి చెందిన కొర్ల శివకు ఆరు నెలల జైలుశిక్ష, రూ.500ల జరిమానాను నరసన్నపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.వాణి విధించారు. వివరాల్లోకి వెళ్తే.. ఎచ్చెర్ల మండలం యాతపేటకు చెందిన సోడి పైడిరాజు ద్విచక్ర వాహనం నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద పార్క్‌ చేయగా చోరీకి గురైంది. ఈ మేరకు ఈ ఏడాది మే 30న నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కొర్ల శివను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చార్జిషీట్‌ పోలీసులు వేయగా, నరసన్నపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి విచారణ చేపట్టారు. సోమవారం కొర్ల శివను దొంగగా నిర్ధారించి జైలుశిక్ష ఖరారు చేశారు. కేసులో ఏపీపీగా శాంతి సంతోషి వ్యవహరించారు. ఈ మేరకు నరసన్నపేట ఎస్‌ఐ సీహెచ్‌ దుర్గాప్రసాద్‌ తెలిపారు.

ఆత్మహత్య చేసుకొని మహిళ మృతి

పలాస: మందస మండలం మఖరజోల గ్రామ పంచాయతీ పరిధి అల్లిమెరక కాలనీలో నివాసముంటున్న కొండ కురమ్మ (22) సోమవారం పలాస మండలం రంగోయి గేటు సమీపంలోని ఒక జీడి తోటలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కురమ్మ తల్లి గాది పద్మ, కాశీబుగ్గ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కురమ్మ భర్త చంద్రశేఖర్‌ కత్తర్‌కు వలస కూలీగా గతేడాది వెళ్లాడు. కురమ్మకు కడుపులో నొప్పి ఉంది. ఇటీవల సోంపేట మండలం జురాబంద గ్రామంలో ఉన్న తన తల్లి వద్దకు వెళ్లింది. కడుపులో నొప్పి ఉందని చెప్పడంతో సోంపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. కన్నవారి ఇంటి నుంచి వచ్చిన కురమ్మ ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ ఎస్‌ఐ ఆర్‌ నరసింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఎస్పీ గ్రీవెన్సుకు 36 వినతులు

శ్రీకాకుళం క్రైమ్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్సుకు 36 వినతులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

లేడీ రౌడీ షీటర్‌పై ఎస్పీకి ఫిర్యాదు

శ్రీకాకుళం క్రైమ్‌: సరుబుజ్జిలి మండలంలోని మూలసవలాపురానికి చెందిన లేడీ రౌడీషీటర్‌, ఆమె అనుచరులపై అదే గ్రామానికి చెందిన కొంతమంది ఎస్పీ మహేశ్వరరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్సుకు వచ్చి తమ గోడు వెల్లబోసుకున్నారు. దందాలు, రౌడీయిజం, సారా, మద్యం, గంజాయి, మాదకద్రవ్యాలు, భూ, ఇళ్ల స్థలాల కబ్జాలు జిల్లా నలుమూలలు చేస్తూ గ్రామ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని బ్యాంకర్స్‌ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న జామి రమేష్‌ తరపున మధ్యవర్తి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నది ఈమె అనుచరులేనన్నారు. అర్ధరాత్రి ఇంటి యజమాని తంగుడు ఉపేంద్ర ఇంట్లో చొరబడి దౌర్జన్యానికి పాల్పడేందుకు యత్నించగా.. స్థానికులు దేహశుద్ధి చేయడంతో వెనుదిరిగారని తెలిపారు. అనేక పోలీస్‌స్టేషన్లలో వీరిపై కేసులున్నాయని పేర్కొన్నారు. ఫిర్యాదు ఇచ్చినవారిలో కె.ధనుంజయ, జి.మోహనరావు, ఎస్‌.వసంత్‌కుమార్‌, జి.శ్రీధర్‌ మరో 30 మందికి పైగా ఉన్నారు. కాగా వీరు ఫిర్యాదు చేసిన కొద్ది గంటల్లోనే అవతలి వర్గం వాళ్లూ ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అక్కడికి కొద్ది క్షణాల్లోనే టౌన్‌ డీఎస్పీ వివేకానంద, ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడు, జె.ఆర్‌.పురం సీఐ అవతారం ఎస్పీని కలిసేందుకు రావడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement