
సైకిల్ యాత్రికునికి ఘన స్వాగతం
జయపురం: అఖిల భారత్ అంతా సైకిల్ యాత్ర జరుపుతూ జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ చేరిన తమిళనాడుకు చెందిన ఆటో డ్రైవర్ అబబుల్లా సాలిమ్ షేఖ్‌కు బొయిపరిగుడ ఆటో డ్రైవర్ల మహా సంఘం సోమవారం ఘన స్వాగతం పలికింది. అబబుల్లాసాలీమ్ షేఖ్ మాట్లాడుతూ.. దేశంలో డ్రైవర్ల సురక్ష, గుర్తింపు కోసం తాను సైకిల్ యాత్ర చేపట్టానని వెల్లడించారు. దేశంలో డ్రైవర్లను సమైఖ్యపరచేందుకు తాను కృషి చేస్తానన్నారు. డ్రైవర్ల సమస్యలను కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఆ లక్ష్యంతో తాను ఆగస్టు 16వ తేదీన సైకిల్ యాత్ర తమిళనాడులో ప్రారంభించానన్నారు. ఇంతవరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీష్‌గఢ్ రాష్ట్రాలలో సైకిల్ యాత్ర పూర్తి చేసుకుని బొయిపరిగుడ వచ్చినట్లు తెలిపారు. తాను దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ సైకిల్ యాత్ర జరుపుతానని, తన సైకిల్ యాత్రలో ప్రభుత్వాల వద్ద మూడు డిమాండ్‌లు ఉంచుతున్నానన్నారు. ప్రమాద బీమా క్‌లైమ్ వెంటనే చెల్లించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుపై రెండు లక్షల రుణంతో పాటు సబ్సిడీ సౌకర్యం కల్పించాలని, నిరుపేద డ్రైవర్ల పిల్లలు చదువుకునేందుకు అన్ని ఉచిత సౌకర్యాలు కల్పించి, వారి విద్యాప్రగతికి నూతన పథకం అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా అతడిని బొయిపరిగుడ ఆటో మహా సంఘ కార్యకర్తలు కలిసి అతడి ఆశయాన్ని కొనియాడారు.